తెలంగాణ రాష్ట్ర సమితి మెదక్ జిల్లా మాజీ అద్యక్షుడు రఘునందనరావు ఇంటి గుట్టును రట్టు చేశారు.ఆయన కెసిఆర్, హరీష్ రావు తదితరులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.దమ్ము ఉంటే పార్టీకి తాను చేసిన ద్రోహం ఏమిటో చెప్పాలని టిఆర్ఎస్ నుంచి సస్పెండైన రఘునందనరావు పార్టీ అదినేత కె.చంద్రశేఖరరావును డిమాండ్ చేశారు. ఏ స్థితిలో అర్దరాత్రి వేళ తనను సస్పెండ్ చేశారో చెప్పాలని రఘునందనరావు వ్యాఖ్యానించారు. చీమలు పెట్టిన పుట్టలో కొన్ని పాములు చేరుతున్నాయని తమలాంటి వారు చెబుతున్నందుకు సస్పెండ్ చేశారా అన్నారు. తాను చంద్రబాబు నాయుడును కలుసుకున్నానని ఆరోపిస్తున్న కెసిఆర్, గతంలో తన మేనల్లుడు హరీష్ రావు రెండువేల తొమ్మిదిలో కాంగ్రెస్ అదికారంలోకి వచ్చాక వై.ఎస్.ను కలిసి పుష్పగుచ్చం ఇచ్చివచ్చారని, ఆయనను కనీసం పిలిచి మాట్లాడారా అని రఘునందనరావు ప్రశ్నించారు.అలాగే తాను ఎమ్మెల్సీ గా పోటీచేసినప్పుడు సిద్దిపేట లో తన ఓట్లను వేరేవారికి వేయించారని , అయినా కనీసం కెసిఆర్ హరీష్ రావును అడగలేదని అన్నారు. ఈ విషయాలపై తాను కెసిఆర్ కుమారుడు తారకరామారావు కు ఈ విషయం బాధపడి చెబితే , ఆయన తనపై కూడా మహేంద్రరెడ్డిని పోటీకి పెట్టించి హరీష్ ఏభై లక్షలు ఇచ్చారని, అయినా తాను మాట్లాడకుండా పనిచేయడం లేదా అని కెటిఆర్ అన్నారని రఘునందనరావు అన్నారు. కాగా తాను పారిశ్రామికవేత్తల నుంచి డబ్బులు వసూళ్లు చేసినట్లు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తానని ఆయన అన్నారు. అలాకాకపోతే తాను కెసిఆర్ కు ఎన్ని చెక్కులు ఎలా వచ్చాయో చెబుతానని ఆయన అన్నారు.నాయిని నరసింహారెడ్డి చెంచా మాదిరి ఎలా పడితే అలా మాట్లాడారని, రెండువేల తొమ్మిది నుంచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నాయిని అన్నారని, అలాంటప్పుడు నాలుగు ఏళ్లు పార్టీ అద్యక్షుడుగా ఉంచారని ప్రశ్నించారు.తనపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పడానికి నలభై ఎనిమిది గంటలు టైమ్ ఇస్తున్నానని అన్నారు. తాను తెలంగాణ వాదినని, అయినా టిఆర్ఎస్ చేస్తున్న మోసాలను చెప్పకుండా ఉండజాలనని అన్నారు. హరీష్ రావు ను కాలిగోటికి కూడా పనికిరారని, అన్న కడియం శ్రీహరిని, అక్కడ ఒక వ్యక్తిని హత్య చేయించిన వ్యక్తిని టిఆర్ఎస్ లో చేర్చుకుంటారా అని రఘునందనరావు ప్రశ్నించారు.గ్రానైట్ వ్యాపారి గంగుల కమలాకర్ ను పార్టీలోకి తీసుకుని నారదాసు లక్ష్మణరావు గొంతు కోశారని ఆయన అన్నారు. డిల్లీ హోటల్ లో ఎవరికి ఎంత డబ్బు కెవిపి ద్వారా వచ్చిందో కూడా తాను చెప్పగలనని అన్నారు. తిరుమలలో హరీష్ రావు కు డబ్బు ఇచ్చానని కూడా అన్నారు.తన పిల్లల కోసం తనను బలి చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజల కోసం తాను పోరాడానే కాని డబ్బుల కోసం కాదని అన్నారు.విజయరామారావు స్వయంగా ఫోన్ చేసి కెసిఆర్ తీరుపై బాదపడ్డారని కూడా ఆయన వెల్లడించారు. నీతిబాహ్యమైన రీతిలో వ్యవహరిస్తూ ,పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన తమను ద్రోహి ముద్ర వేస్తారా అని రఘునందనరావు ప్రశ్నించారు. ఫ్రొఫెసర్ జయశంకర్ ను అగౌరపరిచారని, అలాగే కోదండరామ్ ను నోటికి వచ్చినట్లు నిందించారని, ఆయనను తొలగించడానికి ప్రయత్నించారని, అందరూ వ్యతిరేకిస్తే
అప్పుడు తోకముడిచారని అన్నారు. కెటిఆర్, హరీష్ రావు లు డబ్బులు వసూళ్లు చేశారని , వాటికి సంబందించిన ఆదారాలు అన్ని తన వద్ద ఉన్నాయని అన్నారు.తాను చంద్రబాబు నాయుడును కలిశానన్నది అవాస్తవమని ఆయన అన్నారు. వంద సీట్లు ఇస్తే తెలంగాణ తెస్తానని అంటున్నారని, కాని అది ఎలా సాధ్యమో అర్ధం కాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తిరుపతి వెంకన్న పై ప్రమాణం చేసి తాను ఎక్కడా ద్రోహం చేయలేదని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment