- చంద్రబాబు 9 ఏళ్ల పాలనంతా కుంభకోణాలమయం: అంబటి
- ఆయన అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తానంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు
- బాబు తన కుమారుడ్ని చదివించింది ఏ డబ్బుతో?.. టీడీపీ ఆఫీసు కట్టించి ఇచ్చిందెవరు?
హైదరాబాద్: తొమ్మిదేళ్లు ఈ రాష్ట్రాన్ని అవినీతి, కుంభకోణాలమయంగా పరిపాలించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అవినీతి రహిత భారత దేశాన్ని చూడాలనుకుంటున్నట్లు, అవినీతిపై పోరాటం చేస్తున్నట్లు నీతులు చెప్పడం అక్షరాలా దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నిరంతరం అవినీతితోకూడిన, నీచమైన రాజకీయాలు నడిపి ఎన్నికల ఖర్చు అలవికాని రీతిలో పెరగడానికి కారణమైన బాబు అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తానంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని, వారు చె వుల్లో పూలు పెట్టుకోలేదని చెప్పారు. ‘‘ఆయన అవినీతి పాలనను చూసిన వారంతా ఇప్పుడు లేరని బాబు అనుకుంటున్నారేమో! ఆయన పాలన చూసిన వారిలో 90 శాతానికి పైగా ఇంకా బతికే ఉన్నారు. బాబు పాలనలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో ప్రజలకు తెలుసు.
నకిలీ స్టాంపుల కుంభకోణంలో ఆయన మంత్రివర్గ సహచరుడే నిందితుడు. నీరు - మీరు, ఇంకుడు గుంతలు పేరుతో వేలాది కోట్ల రూపాయల దుర్వినియోగం, స్కాలర్‌షిప్‌లు, ఏలేరు, అర్బన్ బ్యాంకుల కుంభకోణాలు, టూరిజానికి స్థలాల కేటాయింపు, మద్యం ముడుపుల కేసు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి’’ అని అన్నారు. ‘‘సోనియాను ఎదిరించినందుకు జగన్‌పై సీబీఐ విచారణ వేశారు. ప్రభుత్వాన్ని కాపాడుతున్నందుకు, చీకట్లో చిదంబరాన్ని కలిసినందుకు, కాంగ్రెస్‌తో అవగాహన కుదుర్చుకున్నందుకు సీబీఐ విచారణ జరపరని చంద్రబాబు ధైర్యంగా ఉన్నారు.
ఖరీదైన భూమిని ఐఎంజీకి కారుచవకగా కట్టబెట్టిన వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలనే కేసు ఇంకా హైకోర్టులో ఉంది’’ అని గుర్తు చేశారు. ‘‘బాబూ..! అసలు టీడీపీ కార్యాలయం కట్టించి ఇచ్చిందెవరు? నీ తొమ్మిదేళ్ల అవినీతి పాలనలో కాంట్రాక్టులు కట్టబెట్టినందుకు ఎల్ అండ్ టీ కంపెనీ కట్టించి ఇచ్చింది కాదా? నీ కుమారుడు లోకేష్ అమెరికా చదువు కోసం సత్యం రామలింగరాజు డబ్బు కట్టిన విషయం మరిచారా? ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయవేత్త నువ్వేనని తెహల్కా డాట్‌కామ్ వెల్లడించింది మరిచారా’’ అని అన్నారు. వెయ్యి, అయిదు వందల రూపాయల నోట్లు రద్దు చేయాలని బాబు సూచిస్తున్నారంటే.., బహుశా రేపటి ఎన్నికల్లో పంపిణీ చేయడానికి ఆయన వద్ద ఉన్న పెద్ద నోట్లన్నింటినీ వందల్లోకి మార్చుకున్నారేమో అని అంబటి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
వైఫల్యం చెందింది బాబు కాదా: ‘‘అవినీతి మంత్రులను తొలగించాలని వినతిపత్రం ఇస్తే గవర్నర్ పట్టించుకోలేదని, ఆయన విధి నిర్వహణలో విఫలమయ్యారని చంద్రబాబు విమర్శిస్తున్నారు. అసలు చంద్రబాబే ఆయన విధులను నిర్వర్తించే స్థితిలో ఉన్నారా? తొమ్మిదేళ్లు సీఎంగా, మరో తొమ్మిదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా బాబు ఎందుకు విధుల నిర్వహణలో విఫలమయ్యారో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
‘‘బాబుదంతా లాలూచీ కుస్తీ. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాన్ని వదలిపెట్టి, ప్రభుత్వాన్ని కాపాడి, ఇప్పుడు బజారు నాటకాలు ఆడుతున్నారు. ఓవైపు.. మంత్రులను సీఎం కిరణ్ రక్షిస్తున్నారని చెబుతూనే.., అదే సర్కారును బాబు రక్షించడంలేదా’’ అని ప్రశ్నించారు. కోర్టులను ప్రభావితం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఎక్కడా చెప్పలేదని, అన్ని వ్యవస్థలనూ ప్రభావితం చేయగల దిట్ట చంద్రబాబు అని మాత్రమే అన్నారని రాంబాబు తెలిపారు.
జగన్‌ను ఇరికించేందుకే: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కేసుల్లో ఇరికించేందుకే మంత్రులను చార్జిషీట్లలో చేర్చారని, వారు కళంకితులు కారని అంబటి చెప్పారు. ఒక రాజకీయ క్రీడలో భాగంగాకాంగ్రెస్ పార్టీ ఇదంతా చేస్తోందని అన్నారు. ‘‘ఆ 26 జీవోలు సక్రమమేనని, బిజినెస్ రూల్స్ ప్రకారమే జారీ అయ్యాయని సుప్రీం కోర్టుకు మంత్రులే అఫిడవిట్లు ఇచ్చారని, అలాంటపుడు వారు తప్పు చేసినట్లు ఎట్లా అవుతుంది? శంకర్‌రావు లేఖను పరిగణనలోకి తీసుకొని, జీవోలపై హైకోర్టు నోటీసులు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే స్పందించలేదు. ఆ తరువాత సుప్రీంకోర్టులో మాత్రం జీవోలు సక్రమమేనని చెప్పారు. జగన్, మంత్రులు, నిమ్మగడ్డ ప్రసాద్, శ్రీలక్ష్మి ఎవరూ కూడా కళంకితులు కారని తొలి నుంచీ చెబుతున్నాం.
అయితే , మంత్రుల్లో మోపిదేవికి ఒక న్యాయం, ధర్మానకు, సబితా ఇంద్రారెడ్డికి మరొక న్యాయమెందుకని సీబీఐని ప్రశ్నిస్తున్నాం. జగన్ బయట ఉంటే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని చెబుతున్న సీబీఐ.., బయట ఉండి రోజూ సచివాలయానికి వెళుతున్న మంత్రులు మాత్రం ప్రభావితం చేయరని భావిస్తోందా? నీతి, నిజాయితీ, ధర్మం ప్రకారం విచారణ జరుపుతుంటే సీబీఐ అందరిపట్లా ఒకేలా వ్యవహరించేది. కానీ, కాంగ్రెస్ ఏం ఆదేశిస్తే సీబీఐ అది చేస్తోంది. ఏరోజు ఎవరిని అరెస్టు చేయమంటే ఆరోజు వారిని అరెస్టు చేస్తోంది’’ అని అంబటి రాంబాబు చెప్పారు.
0 comments:
Post a Comment