హైదరాబాద్: భూ కేటాయింపులు ఆ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కరి నిర్ణయం కాదని రాజీనామా చేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొనేవారందరూ దోషులుకాదని ఆయన అన్నారు. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. '' పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేపని నేను ఏనాడూ చేయలేదు. వాన్ పిక్ కు భూమి ఇవ్వాలన్నది నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కరి నిర్ణయం కాదు. భూమి ఎవరికివ్వాలన్నది ఐ అండ్ ఐ శాఖ నిర్ణయం. వాన్ పిక్ విషయంలో నోడల్ ఏజెన్సీ ఐ అండ్ ఐ శాఖ మాత్రమే. వాన్ పిక్ భూ కేటాయింపుల్లో నేను సొంతనిర్ణయం తీసుకోలేదు. మంత్రి మండలి నిర్ణయం మేరకే రెవెన్యూ మంత్రిగా తాను వాన్ పిక్ భూ కేటాయింపులపై సంతకం చేశాను. ఈ వ్యవహారంతో రెవెన్యూశాఖకు సంబంధంలేదు. రెవెన్యూశాఖ తప్పులేదని త్వరలో తేలుతుంది. పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందిలేకుండా ఉండేందుకే సిబిఐ ఛార్జిషీటు వేసిననాడే ఆగస్టులోనే నేను రాజీనామా చేశాను. ఆ రాజీనామాకు కట్టుబడి ఉన్నాను. సిబిఐ మమ్మల్ని దోషులుగా పేర్కొనలేదు. ఆరోపణలు వచ్చినంత మాత్రాన దోషులుగా పరిగణించకూడదు. 'ఐఎంజీ భారత' ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చంద్ర బాబు భూములు కేటాయించారు. కోర్టు మమ్మల్ని తప్పు పట్టి శిక్షవిధిస్తే అప్పుడు మేము కళంకితులం అవుతాము. క్విడ్ ప్రోకో అంశాన్ని నావద్ద సిబిఐ ప్రస్తావించలేదు. కొన్ని సాంకేతికాంశాలను మాత్రమే సిబిఐ ప్రస్తావించింది. అవగాహనలేని పేపర్లు మమ్మల్ని అవినీతి మంత్రులని అంటున్నాయి. మేము నిర్ధోషులమని త్వరలో కోర్టులో తేలుతుంది.'' అని ధర్మాన చెప్పారు.
0 comments:
Post a Comment