Monday, 20 May 2013

YS జగన్మోహన్ రెడ్డి కేసులో ఉద్దేశపూర్వక తాత్సారం


హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి భార్య శ్రీమతి వైయస్ భారతి ఆదివారం నాడు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. తన భర్త శ్రీ జగన్మోహన్ రెడ్డి కేసులో సీబీఐ ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తోందని ఆరోపించారు. ప్రధాని జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఆమె ఆ లేఖలో విజ్ఙప్తి చేశారు.

సీబీఐ దర్యాప్తు నిబంధనల ప్రకారం సాగటం లేదని ఆ లేఖలో ఆరోపించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టడమే సీబీఐ లక్ష్యంగా పెట్టుకోవడమే దీనికి కారణమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిన సీబీఐ శ్రీ జగన్మోహన్ రెడ్డిని వచ్చే సాధారణ ఎన్నికల వరకూ జైలులోనే ఉంచేలా కుట్ర చేస్తోందని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.  
తన భర్త శ్రీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఆయనపై కేసులు బనాయించారని తెలిపారు. ఏడాది కాలంగా ఆయనను జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారనీ, గత ఏడాది మే 27న శ్రీ జగన్‌ను అరెస్టు చేశారనీ వివరించారు. ఉద్దేశపూర్వకంగానే ఈ కేసు దర్యాప్తును సీబీఐ తాత్సారం చేస్తోందని చెప్పారు.

కిందటేడాది అక్టోబరులో దర్యాప్తు పూర్తికి మూడు నెలల గడువు కోరిన సీబీఐ ఈ మేనెలలో సుప్రీం కోర్టులో బెయిలు పిటిషన్ విచారణకు వచ్చినపుడు మరో నాలుగు నెలల సమయం కావాలని కోరిందనీ తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాలు వెలువడిన నిముషాలలో సీబీఐ న్యాయవాది అశోక్ భాన్ విలేకరులతో మాట్లాడుతూ దర్యాప్తునకు మరింత గడువు కోరతామని సూచనప్రాయంగా చెప్పిన విషయాన్ని శ్రీమతి భారతి ఈ సందర్భంగా ప్రస్తావించారు.దర్యాప్తు నాలుగు నెలలలో పూర్తికాకపోవచ్చని చెప్పారన్నారు.
అశోక్ భాన్ చేసిన ఈ ప్రకటనను పురస్కరించుకుని సీబీఐ దర్యాప్తును పూర్తిచేసే ఉద్దేశంలో లేనట్లు స్పష్టమైందనీ, మీరు ఈ అంశంలో వెంటనే జోక్యం చేసుకోవాలనీ ఆమె ప్రధానికి విజ్ఞప్తిచేశారు. జోక్యం చేసుకుని న్యాయంచేస్తే దేశం మిమ్మల్ని న్యాయమైన అంశాలను గుర్తించే ఓ నాయకునిగా గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే నిశ్శబ్దంగా నిలిచిపోయిన నాయకుడిగా మీరు మిగిలిపోకూడదని సూచించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ మూడు దశాబ్దాల పాటు దేశానికీ, కాంగ్రెస్ పార్టీకి సేవచేసిన విషయాన్ని మరువరాదని శ్రీమతి భారతి ఆ లేఖలో మన్మోహన్ సింగ్‌ను కోరారు.

2004-2009 సంవత్సరాల మధ్యకాలంలో తన భర్త శ్రీ జగన్మోహన్ రెడ్డి రాజ్యంగపరమైన ఎటువంటి భాధ్యతలను నిర్వర్తించని విషయాన్ని ఆమె ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీని శ్రీ జగన్ వీడిన తర్వాత, దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ మరణించిన 15 నెలల తర్వాత కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ శంకరరావు రాసిన లేఖతో ఆయనపై కేసులు నమోదుచేశారన్నారు. అనంతరం శంకరరావుకు మంత్రి పదవి దక్కిన విషయాన్ని ఆమె ఆ లేఖలో గుర్తుచేశారు.

మంత్రులు, ఇతరులను విడిచిపెట్టి 52వ నిందితుడిగా ఉన్న శ్రీ జగన్మోహన్ రెడ్డిని ఒకటో నిందితునిగా మార్చారని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడమే కాక న్యాయపరమైన ఖర్చులను కూడా భరించాలని నిర్ణయించిందన్నారు. సాక్షులను ప్రభావితం చేస్తారనే నెపం చూసి శ్రీ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు.

సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తును జాప్యం చేస్తున్నారని శ్రీమతి భారతి పేర్కొన్నారు. దర్యాప్తు అంశాలను ఎంపిక చేసుకున్న మీడియాకు సీబీఐ జేడీ లీక్ చేసి తద్వారా తన భర్త శ్రీ జగన్మోహన్ రెడ్డినీ, ఆయన స్థాపించిన పార్టీ  ప్రతిష్టనూ దెబ్బతీసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈ అంశంపై తాము ఇప్పటికే ఫిర్యాదు చేశామనీ, ఆయన చేసిన 500 కాల్సు జాబితాను మీడియాకు విడుదల చేశామనీ వివరించారు. నా భర్త ప్రతిష్టను దెబ్బతీసే హక్కు ఆయనకు ఎవరిచ్చారనీ శ్రీమతి భారతి ప్రశ్నించారు. 

సాక్షిలో పెట్టుబడులు అనైతికమన్న ఆరోపణలను ఆ లేఖలో శ్రీమతి భారతి ఖండించారు. రాబర్టు వాద్రా, డింపుల్ యాదవ్ లాంటి వారికి ఆరోపణలనుంచి విముక్తి కల్పించి, ప్రభుత్వానితో సంబంధంలేని తన భర్తను వేధించడం ఎంతవరకూ సమంజసమని ఆమె ప్రధానిని ప్రశ్నించారు.
తమ కుటుంబం ప్రశాంతమైన జీవితం గడపాలనీ, అలాగే తండ్రి అభిమానాన్ని పొందే హక్కు పిల్లలకుంటుందనీ, పేర్కొంటూ.. తమ కుటుంబానికి న్యాయం చేయాలని శ్రీమతి భారతి ప్రధానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.  

సీబీఐ డైరెక్టరుకూ లేఖ
శ్రీమతి భారతి సీబీఐ డైరెక్టరకు కూడా లేఖ రాశారు. నాలుగు నెలల అనంతరం మరింత సమయం కావాలని కోరతామని సీబీఐ న్యాయవాది అశోక్ భాన్ చేసి ప్రకటనపై విచారణ చేపట్టాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఈ విధమైన ప్రకటన చేయడానికి అశోక్ భాన్‌కు ఎవరు అధికారమిచ్చింది కనుగొనాలని ఆమె విజ్ఞప్తిచేశారు.

0 comments:

Post a Comment