Tuesday, 21 May 2013

చంద్రబాబు పై YS విజయమ్మ ధ్వజం


టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు పై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తూ, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ఆమె విమర్శించారు. ఎన్.టి.ఆర్.పేరు చెప్పుకునే ఆయన బతుకుతున్నాడని , తెహల్క డాట్ కామ్ రెండువేల సంవత్సరంలోనే చంద్రబాబును అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడని , అవినీతిపరుడని పేర్కొందని ఆమె అన్నారు గత మూడేళ్లుగా అన్ని ఎన్నికలలో టిడిపి ఓటమి చెందిందని,అనేకచోట్ల డిపాజిట్లు కోల్పోయిందని ఆమె వ్యాఖ్యానించారు.జగన్ పై కాంగ్రెస్ నేతలు, మంత్రులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని, ఉరి తీయాలని కూడా అంటున్నారని, దేవుడు వీటిని గమనిస్తున్నారని, త్వరలో జగన్ బయటకు వస్తారని, ప్రజల పక్షాన పనిచేస్తారని అన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు ను జగన్ పూర్తి చేస్తారని ఆమె ప్రకటించారు.
కాగజ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

మిగిలిన మంత్రులకు ఎసరు పెట్టిన బొత్స సత్యనారాయణ


పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులంతా రాజీనామా చేయవలసిందేనని ఆయన ప్రకటించారు. నిన్నమొన్నటి వరకు మంత్రుల తప్పు లేదని చెబుతూ వచ్చిన బొత్స ప్రకటన ఉద్దేశం అదిష్టానం నిర్ణయానుసారం మాట్లాడడమా?లేక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఇరుకున పెట్టడమా?అన్నది చూడాల్సి ఉంది.అంతేకాక పార్టీని వదలి వెళుతున్న ఎమ్.పిలను ఉద్దేశించి మాట్లాడుతూ పట్టుకుని వేలాడుతామా అని కూడా ఆయన అన్నారు.తెలంగాణ అంశం కేంద్రం పరిదిలో ఉందంటూ , ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీని బలోపేతం చేయడానికి సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు.పత్రికలు ఎవరి ఎజెండా ప్రకారం రాస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.మంత్రులకు సంబందించి బొత్స చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.మంత్రులు పొన్నాల లక్ష్మయ్య,కన్నా లక్ష్మీనారాయణ,గీతారెడ్డిలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది

రఘునందన్ సంచలన ఆరోపణ

టిఆర్ఎస్ నుంచి సస్పెండైన నేత రఘునందనరావు మరో సంచలన ఆరోపణ చేశారు.జగన్ కేసులో నిందితుడుగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి టిఆర్ఎస్ నేతలు పది కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు.దీనికి సంబందించిన ఆదారాలు సిబిఐకి ఇచ్చినట్లు ఆయన మీడియాకు చెప్పడం విశేషం.అలాగే ఎమ్.ఆర్.కేసులో ఉన్న కోనేరు ప్రసాద్, తుమ్మల రంగారావులతో కెసిఆర్,హరీష్ రావు లావాదేవీలు నడిపారని ఆయన ఆరోపించారు.

'ప్రాణహిత'కు జాతీయహోదా: YS విజయమ్మ డిమాండ్


సిర్పూర్-కాగజ్ నగర్(ఆదిలాబాద్ జిల్లా): ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ డిమాండ్ చేశారు.ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. జలయజ్ఞం ప్రాజెక్టులపై ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. జగన్ సీఎం కాగానే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేస్తారని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ జిల్లాలకు నీటి కష్టాలు తీరుతాయన్నారు. 

ఈ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్టదన్నారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని చెప్పారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. సబ్ ప్లాన్ అని గొప్పలు చెప్పుకుంటున్నారని, దళితులకు జరిగిన న్యాయం ఏమీలేదన్నారు. 

అమ్మహస్తం మాయా హస్తంగా మారిందని విమర్శించారు. రాజీవ్ యువకిరణాల వల్ల ఎవరికి లబ్ధి చేకూరిందో ెప్పాలన్నారు. 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఎక్కడ, ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సిపి తరపున కార్యకర్తలు సైనికుల్లాగా పని చేయాలనిపిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

బాబుకు తలొగ్గిన ప్రభుత్వం: శోభానాగిరెడ్డి


హైదరాబాద్: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోసం ఏం చేయడానికైనా రాష్ట్రప్రభుత్వం వెనుకాడటం లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ శోభా నాగిరెడ్డి అన్నారు. చంద్రబాబు ఏం చెబితే కాంగ్రెస్‌ పార్టీ అదే పాటిస్తుందని ఆరోపించారు. 

ముఖ్యమంత్రిని చంద్రబాబు మార్చాలంటే.. మార్చే స్థితిలో కాంగ్రెస్‌ ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డిమాండ్‌కు తలొగ్గి ఇద్దరు మంత్రులను బలిపశువులను చేశారని అన్నారు. ధర్మాన ప్రసాదరావు రాజీనామాపై ఇంత హడావుడిగా నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఏమొచ్చిందని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. 

సిబిఐ ఈ కేసును స్వీకరిస్తుందా!


తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సస్పెండైన రఘునందనరావు చెప్పినట్లుగానే చేశారు. టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమ వసూళ్లపై చర్య తీసుకోవాలని కోరుతూ రఘునందనరావు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా కేసీఆర్, హరీష్‌రావులపై సీఆయన తన ఫిర్యాదును ఇచ్చారు. తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించానని ఆయన తెలిపారు. న్యాయనిపుణులపై చర్చించిన తర్వాత తిరిగి పిలుస్తామన్నారని అన్నారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ రఘునందనరావు రెండు రోజుల క్రితం డీజీపీ దినేష్ రెడ్డికి ఫిర్యాదు చేయగా, ఇప్పుడు కెసిఆర్, హరీష్ లపై ఫిర్యాదు సిబిఐకి ఫిర్యాదు చేయడం విశేషం.అయితే ఈ ఫిర్యాదును నేరుగా సిబిఐ చేపట్టే అవకాశం ఉందా అన్నది చర్చనీయాంశం. న్యాయవాది అయిన రఘునందనరావు ఏ చట్టం ప్రకారం ఈ ఫిర్యాదు చేశారో తెలియవలసి ఉంది. సిబిఐ ఈ కేసును స్వీకరిస్తుందా?

యుపిఎకి గడ్డుకాలమే-సర్వే ఫలితాలు

కేంద్రంలో యుపిఎ భవిష్యత్తు కొంత గందరగోళంగానే ఉన్నట్లుంది.పశ్చిమబెంగాల్ కు చెందిన ఒక టీవీ ఛానల్ కోసం నీల్సన్ చేసిన సర్వే ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎకి కేవలం 136 సీట్లే వచ్చే అవకాశం కనబడుతోంది. అదే బిజెపి నేతృత్వంలోని ఎన్.డి.ఎ. సీట్ల సంఖ్య 206 సీట్లకు పెరగవచ్చు.దేశవ్యాప్తంగా నూట ఏభై రెండు సీట్లలో చేసిన సర్వే ప్రకారం వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ కు పూర్తి నిరాశగా ఉన్నాయని చెప్పాలి.అయితే బిజెపి కి పూర్తి స్థాయి అదికారం వచ్చే అవకాశం కనడడం లేదు. అంటే టిడిపి,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్,తృణమూల్ కాంగ్రెస్,బిజెడి వంటి పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ పార్టీలలో ఎక్కువ సీట్లు తెచ్చుకునే పార్టీలు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఉంది.

నాడు వై.ఎస్.ఆర్., నేడు విజయమ్మ

దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విపక్ష నేతగా ఉన్న సమయంలో టిడిపి అదికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పెండింగు ప్రాజెక్టులు, శంకుస్థాపనలు చేసి పూర్తి కాని ప్రాజెక్టు శిలాఫలకాలను సందర్శించి అక్కడ మొక్కలు నాటి నిరసన కార్యక్రమాలు చేసి వచ్చారు.ఇప్పుడు ఆయన సతీమణి, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నవై.ఎస్.విజయమ్మ కూడా ఇప్పుడు అదే పనిలో పడ్డారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ వెళ్లిన విజయమ్మ గతంలో వై.ఎస్.శంకుస్థాపన చేసిన ప్రాణహిత ప్రాజెక్టు శిలాఫలకం వద్ద ఒక మొక్క నాటారు.అలాగే బోటులో ప్రాణహిత నదిలో కొంతదూరం వెళ్లి ప్రాజెక్టు ప్రదేశాన్ని చూసి వచ్చారు.మిగిలిన ప్రాజెక్టు స్థలాలను కూడా ఆమె సందర్శిచబోతున్నారు.ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న విజయమ్మ రచ్చబండ, ప్రాజెక్టుల సందర్శన వంటి ఆందోళనలను నిర్వహిస్తున్నారు.

'కేసీఆర్, హరీష్ పై సీబీఐకి ఫిర్యాదు'


హైదరాబాద్: కేసీఆర్, హరీష్‌రావుపై సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు ఫిర్యాదు చేసినట్టు టీఆర్ఎస్ నుంచి బహిష్కృతుడయిన రఘునందన్ రావు తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించానని చెప్పారు. టీఆర్ఎస్ కు సంబంధించిన అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపారు. న్యాయనిపుణులపై చర్చించిన తర్వాత తిరిగి పిలుస్తామన్నారని అన్నారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ రఘునందన్ రావుపై టీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ రఘునందనరావు రెండు రోజుల క్రితం డీజీపీ దినేష్ రెడ్డిని కలిశారు. తమకు భద్రత కల్పించాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

జగన్ వస్తే సమస్యల పరిష్కారం: YS విజయమ్మ


ఆదిలాబాద్: జగన్ బాబు వస్తే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును ఆమె పరిశీలించారు. తుమ్మడి వద్ద భూమి పూజకు వైఎస్ వేసిన పైలాన్ కు ఆమె పాలాభిషేకం చేశారు. ఆ తరువాత అక్కడ మొక్కలు నాటారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాణహిత- చేవెళ్ల నిర్మిద్దాం తెలంగాణను సశ్యశ్యామలం చేద్దాం అని పిలుపు ఇచ్చారు. 

ప్రాణహిత- చేవెళ్లకు నాడు వైఎస్ ఊపిరిపోస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పాడెకడుతోందన్నారు. తెలంగాణ గుక్కెడు నీటిని కిరణ్ సర్కారు లాగేసి గొంతును నులిపేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలకు నీటి సమస్య ఉందని వైఎస్ చెప్పారన్నారు. తెలంగాణ ముక్కోటి రత్నాల వీణ అని వైఎస్ చెప్పినట్లు తెలిపారు. ఆయన బతికి ఉంటే ఈ ప్రాంతం సస్యశ్యామలం అయి ఉండేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే లక్షా 56 వేల 800 ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. 

ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు సందర్శనకు విజయమ్మ హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరారు. హైదరాబాద్ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్ లో బయలుదేరిన ఆమె ఉదయం 11.15 గంటలకు కాగజ్‌నగర్ చేరుకున్నారు. కాగజ్ నగర్ నుంచి విజయమ్మ రోడ్డు మార్గం గుండా కౌటాల మండలం తుమ్మిడిహెట్టికి చేరుకున్నారు. విజయమ్మ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండా సురేఖ, ఇంద్రకరణ్ రెడ్డి, బొడ జనార్దన్, కోనేరు కోనప్ప, జనక్ ప్రసాద్ ఉన్నారు.