ఆదిలాబాద్: జగన్ బాబు వస్తే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును ఆమె పరిశీలించారు. తుమ్మడి వద్ద భూమి పూజకు వైఎస్ వేసిన పైలాన్ కు ఆమె పాలాభిషేకం చేశారు. ఆ తరువాత అక్కడ మొక్కలు నాటారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాణహిత- చేవెళ్ల నిర్మిద్దాం తెలంగాణను సశ్యశ్యామలం చేద్దాం అని పిలుపు ఇచ్చారు.
ప్రాణహిత- చేవెళ్లకు నాడు వైఎస్ ఊపిరిపోస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పాడెకడుతోందన్నారు. తెలంగాణ గుక్కెడు నీటిని కిరణ్ సర్కారు లాగేసి గొంతును నులిపేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలకు నీటి సమస్య ఉందని వైఎస్ చెప్పారన్నారు. తెలంగాణ ముక్కోటి రత్నాల వీణ అని వైఎస్ చెప్పినట్లు తెలిపారు. ఆయన బతికి ఉంటే ఈ ప్రాంతం సస్యశ్యామలం అయి ఉండేదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే లక్షా 56 వేల 800 ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు.
ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు సందర్శనకు విజయమ్మ హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరారు. హైదరాబాద్ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్ లో బయలుదేరిన ఆమె ఉదయం 11.15 గంటలకు కాగజ్‌నగర్ చేరుకున్నారు. కాగజ్ నగర్ నుంచి విజయమ్మ రోడ్డు మార్గం గుండా కౌటాల మండలం తుమ్మిడిహెట్టికి చేరుకున్నారు. విజయమ్మ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండా సురేఖ, ఇంద్రకరణ్ రెడ్డి, బొడ జనార్దన్, కోనేరు కోనప్ప, జనక్ ప్రసాద్ ఉన్నారు.
0 comments:
Post a Comment