Saturday, 18 May 2013

గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో విఫలం: ఎమ్మెల్యే కేటీఆర్


హైదరాబాద్: గల్ఫ్‌ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సిరిసిల్లా ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గల్ఫ్ బాధితుల కోసం బడ్జెట్‌ను సవరించి 500 కోట్ల రూపాయలను కేటాయించాలి అని కేటీఆర్‌ డిమాండ్ చేశారు. గల్ఫ్‌ బాధితుల కోసం కేరళ తరహాలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ సూచించారు. పార్టీ మారుతున్నారనే సమాచారంతోనే రఘునందన్‌రావుపై వేటు వేశామని కేటీఆర్‌ తెలిపారు.

కాంగ్రెస్ పెద్దల సూచన మేరకు కొత్త డ్రామా

- కాంగ్రెస్ పెద్దల సూచన మేరకు కొత్త డ్రామాకు తెరలేపారు
- ఆరోపణలున్న మంత్రుల వ్యవహారంలో ఏడాదిగా మౌనం పాటించారు
- ఢిల్లీ వెళ్లివచ్చాకే అకస్మాత్తుగా గొంతు విప్పడం అనుమానాలకు తావిస్తోంది 
- లోకకల్యాణం కోసం పాటుపడుతున్నానని బాబు చెప్పుకోవడం సిగ్గుచేటు
- చీకటి ఒప్పందాలతో.. కాంగ్రెస్‌కు ఆపన్నహస్తం అందిస్తున్నారు 


హైదరాబాద్: వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల సూచన మేరకు కొత్త డ్రామాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ఇటీవలి కాలంలో బాబు రెండు పర్యాయాలు ఢిల్లీ పర్యటన చేసిన తరువాతే.. వివాదాస్పద 26 జీవోలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల విషయంలో కొత్త పంథాలో ముందుకెళుతున్నారని ఆయన చెప్పారు. మంత్రి ధర్మానపై చార్జిషీట్ వేసి ఏడాది కావొస్తున్నదని, ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు ఢిల్లీ వెళ్లిరాగానే అకస్మాత్తుగా గవర్నర్, రాష్ట్రపతిని కలవాలనే ఆలోచన తట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. శ్రీకాంత్‌రెడ్డి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతున్నా, సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నా, ప్రజలపై పెనుభారం మోపుతున్నా ఏనాడూ స్పందించని చంద్రబాబు.. కుట్రలు, కుతంత్రాలే ఎజెండాగా ముందుకెళుతున్నారని ధ్వజమెత్తారు. 

రాజకీయంగా వైఎస్సార్‌సీపీని నిలువరించేందుకు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ చేసే కుట్రలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలుకుని కేంద్రంలో ఎఫ్‌డీఐ బిల్లు సందర్భంగా ముగ్గురు టీడీపీ ఎంపీల గైర్హాజరుతోపాటు ఇటీవలి కాలంలో రాష్ట అసెంబ్లీలో ప్రభుత్వంపై అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్‌ను రక్షించేందుకు చంద్రబాబు చేసుకున్న కుమ్మక్కులను ఆయన ఒక్కొక్కటిగా వివరించారు.

ఇదంతా కాంగ్రెస్ హైకమాండ్ సూచన మేరకే జరుగుతున్నదని తెలిపారు. మూడేళ్లుగా కాంగ్రెస్‌తో బాబు నడిపిస్తున్న ఈ చీకటి వ్యవహారాలను ఎప్పటికప్పుడు ఆధారాలతోసహా తాము నిరూపిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని చెప్పారు. ఇలాంటి వ్యక్తి లోక కల్యాణంకోసం పాటుపడుతున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అధికార దాహంతో సొంత మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచి మరణానికి కారకుడైన వ్యక్తి నీతులు వల్లించడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తనకు సైకిల్‌గుర్తు ఎలా వచ్చిందో? పార్టీ కార్యాలయం ఏవిధంగా నిర్మించారో? కొడుకు లోకేష్ చదువులు అమెరికాలో ఎలా కొనసాగాయో ప్రజలకు వివరించగలరా? అని గడికోట సూటిగా ప్రశ్నించారు.

మీకు పార్లమెంటు, మాకు అసెంబ్లీ!
కేంద్ర మంత్రి చిదంబరంను చీకట్లో కలిసి తనపై ఉన్న కేసులు విచారణకు రాకుండా చూసుకున్న చంద్రబాబు... కాంగ్రెస్‌కు అవసరం వచ్చిన ప్పుడల్లా ఆపన్నహస్తం అందిస్తున్నారని శ్రీకాంత్ ఆరోపించారు. ప్రజాసమస్యలు విస్మరించి సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సలు నిత్యం ఢిల్లీ పర్యటనలు చేస్తున్నా బాబుకు పట్టదన్నారు. చీకట్లో కుదిరిన ఒప్పందం మేరకు కాంగ్రెస్.. పార్లమెంటు, టీడీపీ అసెంబ్లీ స్థానాలకు ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించారని పేర్కొ న్నారు. తమను ఎన్ని కష్టనష్టాలకు గురిచేసినా వైఎస్ కుటుంబం ప్రజలకోసం మొక్కవోని ధైర్యంతో ముం దుకు సాగుతోందన్నారు. వైఎస్ జగన్‌పై సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ జరపట్లేదని, అదంతా లోపభూయిష్టంగా ఉందని చెప్పారు. వైఎస్ ఇమేజ్‌ను దెబ్బతీసేం దుకు, జగన్‌ను అణచివేసేందుకు కాంగ్రెస్, టీడీపీలు కలిసి సీబీఐతో నాటకమాడిస్తున్నాయన్నారు.

మంత్రి దర్మాన ప్రసాదరావుకు కిరణ్ ఫోన్

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి దర్మాన ప్రసాదరావుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మని కోరడంతో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం వెలువడుతుందా అన్న చర్చ జరుగుతోంది.మంత్రి దర్మాన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ స్వయంగా దర్మానకు ఫోన్ చేశారని సమాచారం.ఎఐసిసి అధికార ప్రతినిది చాకో జగన్ కేసులో ఉన్న మంత్రులు రాజీనామా చేయాలని బహిరంగంగా ప్రకటించడంతో ముఖ్యమంత్రికి సైతం ఇరకాట పరిస్థితి ఏర్పడింది.ఇప్పటికే మంత్రులు ధర్మాన,సబితలు రాజీనామా చేయగా వాటిని సి.ఎమ్. తోసిపుచ్చారు. ఈ దశలో మళ్లీ రాజీనామా కోరాల్సి రావడం ఆయనకు ఇబ్బందిగా మారుతుంది.అయినప్పట్టికీ ధర్మానతో ,అలాగే సబితతో కిరణ్ ఏమి చెబుతారో చూడాలి.కాగా ఒక వేళ మంత్రి పదవిని వదలుకోవలసి వస్తే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని ధర్మాన అనుచరులు డిమాండ్ చేస్తూ పార్టీని హెచ్చరిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవికే క్లీన్ ఇమేజీ ఉందా

రాష్ట్ర మంత్రి సి.రామచంద్రయ్య మెగాస్టార్ తరపున గట్టి వాదనే వినిపిస్తున్నారు.కర్నాటకలో కాంగ్రెస్ కు క్లీన్ ఇమేజీ ఉంది కాబట్టే ప్రజలు అదికారంలోకి తెచ్చారని, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ కు క్లీన్ ఇమేజీ ఉంటేనే అదికారంలోకి తెస్తామని ఆయన చెబుతున్నారు. రెండువేల పద్నాలుగులో చిరంజీవి ముఖ్యమంత్రి అభ్యర్ది అయితే తప్పేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే చిరంజీవికి క్లీన్ ఇమేజీ ఉందని ఆయన చెప్పదలచారు.నేరుగా ముఖ్యమంత్రి కిరణ్ కు క్లీన్ ఇమేజీ లేదని చెప్పనప్పట్టికీ, చిరంజీవి తరపున ప్రచారం చేయడం ద్వారా రామచంద్రయ్య ముఖ్యమంత్రికి అసహనం తెప్పిస్తున్నారన్న భావన కలుగుతుంది. అయినప్పట్టికీ తనను మంత్రి పదవి నుంచి తొలగించరని,అలాంటి ప్రచారం అంతా అవాస్తవమని ఆయన చెబుతున్నారు.వచ్చే ఎన్నికలలో ఎవరి నాయకత్వం కోరుకుంటారో ప్రజలే చూసుకుంటారని ఆయన అబిప్రాయపడ్డారు.చిరంజీవి తరపున గట్టిగానే బాటింగ్ చేస్తున్న రామచంద్రయ్యకు తన వికెట్ పడకుండా చిరూనే చూసుకుంటారన్న దీమా కావచ్చు.

పొత్తులకు, విధానాలకు సంబంధం ఉండదా!


భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అగ్రనేత ఎబి బర్దన్ ఒక మాట చెప్పారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఆ పార్టీ విధానాలను తాము ఆమోదించినట్లు కాదని, అలాగే ప్రత్యేక తెలంగాణను సమర్థించినంత మాత్రాన తమది టీఆర్ఎస్ భావజాలం కాదని ఆయన చెప్పారు.గత కొంతకాలంగా సిపిఐ నేతలు టిడిపి అదినేత చంద్రబాబు నాయుడుతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ఉండగా , ఆ తర్వాత పాదయాత్ర పూర్తి చేసుకుని వచ్చాక సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆయనను కలిశారు. రెండు రోజుల క్రితం బర్దన్ కూడా చంద్రబాబు కలిసి తృతియ ఫ్రంట్ గురించి చర్చించారు.అయితే వారిది ఒక చిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుందామని అనుకుంటే ఆ పార్టీ అందుకు సిద్దంగా లేదు. దాంతో కొంత నిరుత్సాహానికి గురి అయింది.ఆ మీదట టిఆర్ఎస్ పై నారాయణ మండిపడ్డారు. కాగా టిడిపితో పొత్తు పెట్టుకునే విషయంలో ఒక అడుగు ముందుకు వేసినట్లు కనిపిస్తుంది.కాకపోతే ఇప్పుడే ఆ విషయం ప్రకటించకుండా ఎన్నికల సమయంలోనే పొత్తులు ఉంటాయని నారాయణ కూడా అన్నారు.అయితే ఎందుకైనా మంచిదని పొత్తులకు , పార్టీల విధానాలకు సంబందం లేదని సిపిఐ నేతలు సూత్రీకరిస్తున్నారు.

సిరిసిల్లా బయలుదేరిన YSవిజయమ్మ!

హైదరాబాద్: నేతన్నల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు బయలుదేరారు. అప్పలు బాధను తట్టుకోలేక ఇటీవల ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నల కుటుంబాలను విజయమ్మ పరామర్శించనున్నారు.

బీజేపీలోకి కేసీఆర్ అన్నకూతురు ?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు అన్న కూతురు రమా మధుసూదనరావు బీజేపీలో చేరేం దుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్నారు. రమ కొన్ని రోజులుగా బీజేపీ ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. జూన్ 3న హైదరాబాద్ నిజాం గ్రౌండ్స్‌లో జరిగే పార్టీ సభలో జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలోనే ఆమె చేరే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు అంటున్నా యి. అదేవిధంగా...హైదరాబాద్ పాతబస్తీలో కాంగ్రెస్ కార్పొరేటర్ ఆలె జితేంద్ర జూన్ 3వ తేదీన బీజేపీలో చేరనున్నారు. ఇతడు కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర రెండో కుమారుడు.

హరీష్ రావు అక్రమాలు బయటపెడ్తా!


కేసీఆర్ మేనల్లుడు హరీష్‌రావుపై టీఆర్‌ఎస్ బహిష్కృత నేత ఎం.రఘునందన్‌రావు గురి పెట్టారు. ఆయనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. తనను పార్టీ గెంటి వేయడంతో గుర్రుగా ఉన్న రఘునందన్ రోజుకో బండారం బయటపెడతానంటూ ప్రకటించారు. హరీష్‌రావు అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెడతానంటూ ప్రతిన బూనారు. అన్నట్టుగా బాంబు పేల్చారు. పద్మాలయ స్టూడియో వివాదం సెటిల్ మెంట్ వ్యవహారంలో హరీష్ రూ. 80 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఎంపీ విజయశాంతి నివాసంలో జరిగిన ఈ వ్యవహారానికి శ్రీనివాస ప్రసాద్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సినీ నిర్మాత కూడా సాక్షులుగా ఉన్నారని వెల్లడించారు. 

టీఆర్ఎస్ లో చంద్రబాబుగా హరీష్‌రావును పోల్చారు రఘునందన్. 2008 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోర పరాజయం తర్వాత పార్టీ అధ్యక్ష పదవి నుంచి కేసీఆర్ ను తప్పించేందుకు హరీష్ కుట్రలు చేశారని వెల్లడించి సంచలనం రేపారు. 'టీఆర్ఎస్ లో చంద్రబాబులా కష్టపడతా.. పార్టీని మళ్లీ బతికించుకుందాం' అని తనతో నేరుగా చెప్పారని కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా తన వద్ద అప్పుడప్పుడు డబ్బు తీసుకున్నారని చెప్పారు. 

కేసీఆర్ తనయుడు కేటీఆర్ హవాను అడ్డుకునేందుకు హరీష్‌రావు ప్రయత్నించారని రఘునందన్ ఆరోపించారు. సిరిసిల్లలో కేటీఆర్ ను ఓడించేందుకు రెబల్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డికి హరీష్ ఏకంగా రూ. 50 లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా అంటూ నిలదీశారు. పార్టీలో ఆధిపత్యం కోసం హరీష్ ఇదంతా చేశారన్నారు. కేసీఆర్‌పై తిరుగుబాటు చేసిన మాజీమంత్రి డాక్టర్ చంద్రశేఖర్, నేతలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రవీంద్రనాయక్, జిట్టా బాలకృష్ణారెడ్డి వంటివారంతా హరీష్‌రావు కుట్రలకు బలైనవారేనని ఆరోపించారు. అటు కేసీఆర్ కూ డబ్బు తప్ప ఏమీ పట్టడం లేదని వాపోయారు. హరీష్ గురించి ఎన్నిసార్లు చెప్పినా అధినేత పట్టించుకోలేదన్నారు. 

రఘునందన్‌రావు తీవ్ర ఆరోపణలు చేస్తున్నా కేసీఆర్ ఇప్పటివరకు నోరు మెదపలేదు. టీఆర్ఎస్ అధ్యక్ష పదవి నుంచి తనను హరీష్ దించేందుకు కుట్రలు చేశారని ప్రకటించినా కేసీఆర్ కిమ్మనకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తనతో పాటు తనయుడు కేటీఆర్ కు ఎసరు పెట్టారని చెప్పినా మేనల్లుడిపై కేసీఆర్ ఒక్క కామెంట్ చేయకపోవడం మరింత అవాక్కయ్యేలా చే్స్తోంది. అటు పార్టీ నేతలు కూడా ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు జంకుతున్నారు. హరీష్‌రావును సమర్ధిస్తే కేసీఆర్ ఆగ్రహానికి గురవుతామేమోననే భయంతో మీడియాకు మొహం చాటేస్తున్నారు. 

మరోవైపు తన ప్రాణానికి ముప్పు వుందంటూ రఘునందన్‌రావు పోలీసులను ఆశ్రయించారు. హరీష్‌రావు గురించి మాట్లాడొద్దని, మాట్లాడితే చంపేస్తామంటూ తనకు సిద్దిపేట నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని డీజీపీని కోరారు. అలాగే హరీష్ అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మరోవైపు ఏ విచారణకైనా తాను సిద్ధమని హరీష్‌రావు ప్రకటించారు. వీరిద్దరి వ్యవహారం ఇంకా ఎంతదూరం పోతుందోనని టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. 

'మెజార్టీ స్థానాలు వైఎస్‌ఆర్‌ సీపీవే'

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. గ్రామ గ్రామానా వైఎస్‌ఆర్‌ సీపీకి ప్రజాదరణ వెల్లువెత్తుతోందని ఆయన చెప్పారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా మెజార్టీ స్థానాలు వైఎస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

ధర్మాన ప్రసాదరావు అనుచరుల రహస్య సమావేశం

శ్రీకాకుళం: భవిష్యత్‌ కార్యాచరణపై మంత్రి ధర్మాన ప్రసాదరావు అనుచరులు ఓ హోటల్‌లో రహస్యంగా సమావేశమయ్యారు. మంత్రిగా వైదొలిగే పరిస్థితులు వస్తే ఏంచేయాలన్నదానిపై సమాలోచనలు జరిపారు. చర్యలు ఎదురైతే ఏకంగా ఎమ్మెల్యే పదవినీ వదిలేయాలని ధర్మానపై ఒత్తిడి తేవాలని వారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీకీ గుడ్‌బై చెప్పేందుకూ వెనుకాడబోమని సంకేతాలు పంపాలనుకుంటున్నట్టు సమాచారం.