Saturday, 18 May 2013

హరీష్ రావు అక్రమాలు బయటపెడ్తా!


కేసీఆర్ మేనల్లుడు హరీష్‌రావుపై టీఆర్‌ఎస్ బహిష్కృత నేత ఎం.రఘునందన్‌రావు గురి పెట్టారు. ఆయనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. తనను పార్టీ గెంటి వేయడంతో గుర్రుగా ఉన్న రఘునందన్ రోజుకో బండారం బయటపెడతానంటూ ప్రకటించారు. హరీష్‌రావు అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెడతానంటూ ప్రతిన బూనారు. అన్నట్టుగా బాంబు పేల్చారు. పద్మాలయ స్టూడియో వివాదం సెటిల్ మెంట్ వ్యవహారంలో హరీష్ రూ. 80 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఎంపీ విజయశాంతి నివాసంలో జరిగిన ఈ వ్యవహారానికి శ్రీనివాస ప్రసాద్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సినీ నిర్మాత కూడా సాక్షులుగా ఉన్నారని వెల్లడించారు. 

టీఆర్ఎస్ లో చంద్రబాబుగా హరీష్‌రావును పోల్చారు రఘునందన్. 2008 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోర పరాజయం తర్వాత పార్టీ అధ్యక్ష పదవి నుంచి కేసీఆర్ ను తప్పించేందుకు హరీష్ కుట్రలు చేశారని వెల్లడించి సంచలనం రేపారు. 'టీఆర్ఎస్ లో చంద్రబాబులా కష్టపడతా.. పార్టీని మళ్లీ బతికించుకుందాం' అని తనతో నేరుగా చెప్పారని కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా తన వద్ద అప్పుడప్పుడు డబ్బు తీసుకున్నారని చెప్పారు. 

కేసీఆర్ తనయుడు కేటీఆర్ హవాను అడ్డుకునేందుకు హరీష్‌రావు ప్రయత్నించారని రఘునందన్ ఆరోపించారు. సిరిసిల్లలో కేటీఆర్ ను ఓడించేందుకు రెబల్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డికి హరీష్ ఏకంగా రూ. 50 లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా అంటూ నిలదీశారు. పార్టీలో ఆధిపత్యం కోసం హరీష్ ఇదంతా చేశారన్నారు. కేసీఆర్‌పై తిరుగుబాటు చేసిన మాజీమంత్రి డాక్టర్ చంద్రశేఖర్, నేతలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రవీంద్రనాయక్, జిట్టా బాలకృష్ణారెడ్డి వంటివారంతా హరీష్‌రావు కుట్రలకు బలైనవారేనని ఆరోపించారు. అటు కేసీఆర్ కూ డబ్బు తప్ప ఏమీ పట్టడం లేదని వాపోయారు. హరీష్ గురించి ఎన్నిసార్లు చెప్పినా అధినేత పట్టించుకోలేదన్నారు. 

రఘునందన్‌రావు తీవ్ర ఆరోపణలు చేస్తున్నా కేసీఆర్ ఇప్పటివరకు నోరు మెదపలేదు. టీఆర్ఎస్ అధ్యక్ష పదవి నుంచి తనను హరీష్ దించేందుకు కుట్రలు చేశారని ప్రకటించినా కేసీఆర్ కిమ్మనకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తనతో పాటు తనయుడు కేటీఆర్ కు ఎసరు పెట్టారని చెప్పినా మేనల్లుడిపై కేసీఆర్ ఒక్క కామెంట్ చేయకపోవడం మరింత అవాక్కయ్యేలా చే్స్తోంది. అటు పార్టీ నేతలు కూడా ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు జంకుతున్నారు. హరీష్‌రావును సమర్ధిస్తే కేసీఆర్ ఆగ్రహానికి గురవుతామేమోననే భయంతో మీడియాకు మొహం చాటేస్తున్నారు. 

మరోవైపు తన ప్రాణానికి ముప్పు వుందంటూ రఘునందన్‌రావు పోలీసులను ఆశ్రయించారు. హరీష్‌రావు గురించి మాట్లాడొద్దని, మాట్లాడితే చంపేస్తామంటూ తనకు సిద్దిపేట నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని డీజీపీని కోరారు. అలాగే హరీష్ అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మరోవైపు ఏ విచారణకైనా తాను సిద్ధమని హరీష్‌రావు ప్రకటించారు. వీరిద్దరి వ్యవహారం ఇంకా ఎంతదూరం పోతుందోనని టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. 

0 comments:

Post a Comment