Tuesday, 30 April 2013

తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏం చేశారు?


హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాదయాత్ర సందర్భంగా ప్రజలకు శుష్క, మస్కా వాగ్దానాలిచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. ఆ హామీలేవీ నెరవేర్చేవి కావన్నారు. గట్టు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 1984 నుంచీ బాబు టీడీపీలో కీలక వ్యక్తి అని, 1995లో మామ నుంచి అధికారాన్ని లాక్కుని ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు. అప్పటినుంచి తొమ్మిదేళ్లు అధికారం చలాయించిన బాబు అసలు ప్రజలకు ఏమేమి వాగ్దానాలు చేశారు? వాటిలో ఎన్ని అమలు చేశారనేది తన పాదయాత్ర సందర్బంగా చెప్పి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. వాస్తవానికి చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌నే కాదు, ప్రజలను కూడా తన పాలనలో వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. ‘‘1994 ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ ప్రజలకు రెండు రూపాయల కిలోబియ్యం ఇస్తానని, సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని వాగ్దానం చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి బాబు అధికారం చేజిక్కించుకున్నారు. రెండు రూపాయల కిలోబియ్యం, మద్య నిషేధం వల్ల ఖజానాపై తీవ్ర భారం పడుతోందని చెప్పి 1996 జూన్ 26న (ఎమర్జెన్సీ విధించిన తేదీన) ఒకే రోజు రూ.2,000 కోట్ల మేరకు పన్నులు వడ్డించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే బియ్యం ధరను రూ. 3.25కు పెంచడంతో పాటుగా మద్య నిషేధాన్ని ఎత్తి వేసి రూ.1,200 కోట్ల రాబడి పెంచుకున్నారు’’ అని దుయ్యబట్టారు. 

వ్యవసాయరంగం దుస్థితిని గమనించి ఎన్టీఆర్ ఒక హెచ్‌పీకి రూ.50 విద్యుత్ టారిఫ్‌ను వసూలు చేస్తే దానిని రూ.600కు పెంచిన ఘనుడు చంద్రబాబని విమర్శించారు. కేజీ నుంచి పీజీ వరకు మహిళలకు ఉచిత విద్య, ఉచిత బస్సుపాసులని 1999 ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి, గెలిచాక వాటన్నింటినీ తుంగలో తొక్కారని గుర్తుచేశారు. ముందడుగు వెనక్కి పోయిందని, చేయూత, రోష్ని పథకాలన్నీ అటకెక్కించారని విమర్శించారు. ఇంటికో వరం అని చెప్పి ప్రతి ఇంటిపైనా పన్ను భారం మోపారని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో వృద్ధాప్య పింఛన్లను పట్టించుకోని బాబు ఇప్పుడు దారిలో ఒక ముసలమ్మను చూసి చలించి పోయాననడం హాస్యాస్పదమన్నారు. ఉద్యోగుల కోసం ప్రాణాలర్పిస్తానని చెబుతున్న బాబు తన ‘మనసులో మాట’ పుస్తకంలో 60 శాతం మంది ఉద్యోగులు అవినీతిపరులేనని రాసుకున్న విషయం మరిచారా? అని ప్రశ్నించారు. వైఎస్‌పై మంద కృష్ణ మాదిగ చేసిన విమర్శలను ప్రస్తావించగా... తన హయాంలో 18 లక్షల మంది వృద్ధులకు రూ. 75 పింఛన్ ఇచ్చిన బాబును పక్కన కూర్చోబెట్టుకుని, 71 లక్షల మందికి రూ. 200 చొప్పున పింఛన్ ఇచ్చిన వైఎస్ ను విమర్శించడం ఎంతవరకు సమంజసమని గట్టు వ్యాఖ్యానించారు.

0 comments:

Post a Comment