ఖమ్మం, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై కేసు నమోదు చేసి జూన్ 28న కోర్టుకు దర్యాప్తు నివేదిక పంపాలని ఖమ్మం మొదటి అదనపు ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ గురువారం ఖమ్మం పోలీసులను ఆదేశించారు. ఈ ఫిర్యాదును ఖమ్మం న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపూడి రామారావు కోర్టులో దాఖలు చేశారు. కేసు వివరాలివీ... 2013 జనవరి 28న హైదరాబాద్‌లో ఇందిరాపార్కు వద్ద జరిగిన సమరదీక్షను ఉద్దేశించి కేసీఆర్ చేసిన ప్రసంగంలో దేశ ప్రధానమంత్రిని అగౌరవ పరుస్తూ ప్రసంగించారని రామారావు తన ఫిర్యాదులో వివరించారు. కేసీఆర్‌మాటలు దేశ ప్రజల ఆత్మగౌరవం, విశ్వాసాలను దెబ్బ తీశాయన్నారు. కాగా, కేసు నమోదు, దర్యాప్తు నిమిత్తం మెజిస్ట్రేట్ ఆదేశించగానే కొందరు న్యాయవాదులు గొల్లపూడి రామారావును దుర్భాషలాడటంతో పాటు ఆయనపై భౌతికదాడికి యత్నించారు. దీంతో కోర్టు ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, ఈఫిర్యాదు వెనుక టీడీపీ హస్తం ఉందని అర్థమవుతోందని న్యాయవాదుల జేఏసీ జిల్లా కన్వీనర్ తిరుమలరావు తెలిపారు. కేసులతో ఉద్యమాలను ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు.
0 comments:
Post a Comment