కొత్తగూడెం: రాష్ట్రంలో ప్రజలపై అన్ని రకాల ఛార్జీలను పెంచి సీఎం కిరణ్ వసూల్ రాజాగా పేరు తెచ్చుకున్నారని కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల ఆరోపించారు. ప్రజలపై భారాన్ని మోపుతున్న కిరణ్ సర్కార్‌ను కాపాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చరిత్ర హీనుడిగా మారారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి మంత్రి పదవి కోసం పార్టీని కాంగ్రెస్‌కు అమ్మితే...చంద్రబాబు ఐఎంజీ, ఎమ్మార్ కేసుల భయంతో అధికార పార్టీకి అమ్ముడుపోయాడని షర్మిల విమర్శించారు.
కేంద్రంలో బొగ్గుకుంభకోణంలో ప్రధానికి సంబంధంలేదని ఛార్జిషీట్‌లో ఉన్న మంత్రులదే బాధ్యత అంటున్న కాంగ్రెస్... రాష్ట్రంలో మాత్రం మంత్రుల పేరు ఛార్జిషీట్‌లో ఉన్నా వారికి ఎలాంటి సంబందం లేదని.. అప్పటి సీఎం వైఎస్‌దే బాధ్యత అని చెప్పడం కాంగ్రెస్ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.
కిన్నెరసాని ప్రాజెక్ట్ నుంచి పదివేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని వైఎస్ తన హయాంలోనే 70శాతం పనులు పూర్తిచేస్తే...నేడు కిరణ్ సర్కార్ నాలుగేళ్లలో 30 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయిందని మండిపడ్డారు. కొత్తగూడెం పట్టణానికి మంచినీరు ఇవ్వాలని కిన్నెరసాని నుంచి వైఎస్ సంకల్పిస్తే.. నేటి పాలకులు మంచినీరును సక్రమంగా అందించలేకపోతున్నారని షర్మిల మండిపడ్డారు.
జగనన్న సీఎం అయితే కొత్తగూడెంలో భూముల క్రమబద్దీకరణకోసం అర్హులైన ప్రతిఒక్కరికి అండగా నిలుస్తారని, సింగరేణి కార్మికులకు ఫించన్లు, ఇళ్లు, వారి పిల్లలకు చదువుల కోసం కృషిచేస్తారని షర్మిల భరోసానిచ్చారు.
0 comments:
Post a Comment