ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీ పెట్టి ఆత్మగౌరవం నినాదంతో అధికారంలోకి వచ్చిన రోజులవి. నేను పదవ తరగతి చదువుతున్నాను. అప్పటికి నాకు ఆత్మగౌరవమంటే అర్థం తెలియదు. ఇప్పుడనిపిస్తుంటుంది ఆత్మగౌరవానికి ఎంత పవరుందీ అని! వైయస్ రాజశేఖర్‌రెడ్డిగారి మరణానంతరం జగన్‌ని ముఖ్యమంత్రిని చేయాలని వారి కుటుంబసభ్యులెవరైనా ఎమ్మెల్యేలను గాని, మంత్రులను గాని ఒత్తిడి చేశారా? లేదే! రాజకీయంగా పేరు ప్రఖ్యాతులున్న కుటుంబాలకు ఇస్తున్న గౌరవంగా భావించి నాడు రాజీవ్‌గాంధీని ఎలా ప్రధానిని చేశారో జగన్‌పై కూడా అదే అభిమానాన్ని ఎమ్మెల్యేలు, ప్రజలు చూపించారు. వైయస్సార్ అంటే ఆది నుండి వ్యతిరేకించే సోనియా భజనపరులు, వైయస్సార్‌ను తిడితే పదవులొస్తాయని భావించే కొందరు అవకాశవాద రాజకీయనాయకులు, లేనిపోని అబద్ధాలను కల్పించి, జగన్‌ని పార్టీ నుండి బయటకు పంపారు. తీరా ఇప్పుడు పార్టీ సర్వనాశనం అయ్యాక గాని అర్థం కాలేదు కాంగ్రెస్‌కు! చేతులు కాలాక ఇప్పుడు ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
జగన్‌ని కాంగ్రెస్‌పార్టీ నుండి బయటకు పంపడానికి ఈ నాయకులు ఎన్నో ఎత్తులు, జిత్తులు ప్రదర్శించారు. కాశ్మీర్ నుండి ఒకరు, కన్యాకుమారి నుండి ఒక రు, తమిళనాడు నుండి ఒకరు, తంజావూరు నుండి మరొకరు మీడియా కనిపిస్తే చాలు పది రోజుల్లో జగన్‌ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారని, లేదు లేదు రేపే సస్పెండు చేస్తారని, అబ్బే ఇంకా టైముందని... ఇలా రోజుకో విధంగా ప్రజల్ని, పార్టీని కన్‌ఫ్యూజన్‌లో పెట్టి మన ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా చేసి, చివరకు కాంగ్రెస్ కూడా ఈ కన్‌ఫ్యూజన్‌లో కొట్టుకుపోయింది.
గ్రామీణ ప్రజలపై, గ్రామీణ రాజకీయాలపై నాకున్న అవగాహన ప్రకారం రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ అంటేనే కుతకుతలాడిపోతున్నారు. ప్రస్తుతం గ్రామీణప్రాంతాల్లో జరుగుతున్నదేమిటో తెలుసా? ఎన్నికలకు ఇంకా ఏడాది సమయముంది గనుక ఎమ్మెల్యేల దగ్గర ద్వితీయశ్రేణి నాయకులు వినయం నటిస్తున్నారు. ద్వితీయశ్రేణి నాయకులు, ఛోటానాయకుల దగ్గర ప్రజలు విధేయత నటిస్తున్నారు. వీరి అందరి నటనా 2014 సాధారణ ఎన్నికలు సమీపించేసరికి జగన్‌పై పూర్తిస్థాయి అభిమానంగా, ఆదరణగా మారుతుంది. ఇది నూటికి నూరుపాళ్లు సత్యం.
నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చిన్న సమస్య ఏర్పడినా, చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి పరుగులు తీయడం! అక్కడి పైస్థాయి ఇతర రాష్ట్ర నాయకులు మన రాష్ట్రంపై అధికారం చలాయించడం!! ఏమిటిదంతా? ఓట్లేసి గెలిపించుకున్న మన నాయకులపై ఇతర రాష్ట్రాల నాయకులు పెత్తనం చలాయించడం ఏమిటి? వెన్నెముక లేకపోవడం అంటే ఇదే. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టడం అంటే ఇదే. మీడియా పుణ్యమా అని ఇవన్నీ చూసి, తెలుసుకుని అర్థం చేసుకుంటున్న గ్రామీణులు వచ్చే ఎన్నికల్లో జగన్‌ను తమ నాయకుడిగా ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా ఆంధ్రులఆత్మగౌరవం మరోసారి గెలవబోతున్నది. ప్రజలకు వీలైనంతగా ఉపయోగపడే నాయకుడు కావాలి. జగన్ సరిగ్గా అలాంటి నాయకుడే. అతడు ధీశాలి. పోరాటయోధుడు. మాటతప్పనివాడు. మడమ తిప్పనివాడు. కల్లోల గాలుల్లో సైతం ఆంధ్రప్రదేశ్ అనే నావను సురక్షితంగా నడిపించగల కెప్టెన్.
0 comments:
Post a Comment