Monday, 6 May 2013

YS షర్మిల వాదనా బాగానే ఉందా!

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పాదయాత్రికురాలు, జగన్ సోదరి షర్మిల ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్ప్రజలకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.కేంద్రంలోకాని, రాష్ట్రంలో కాని అదికారంలో ఉన్నవారు తమకు అనుకూలమైన వాదనలు ఎలా తయారు చేసుకుంటున్నారన్నదానిపై ఆమె ప్రజలకు వివరంగా తెలియచేస్తున్నారు. ఆమె ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో చేసిన ప్రసంగంలో ఆసక్తికరమైన వాదన వినిపించారు. కేంద్రంలో 2జీ స్పెక్ట్రమ్ కేసులో రాజా అనే కేంద్ర మంత్రి పేరు చార్జిషీటులో ఉంటే తప్పంతా ఆయనదే అన్నారు. ఆ కుంభకోణంలో ప్రధానమంత్రికి ఏ సంబంధం లేదని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం చార్జిషీట్‌లో ఉన్న మంత్రుల తప్పు లేదట. తప్పంతా అప్పటి ముఖ్యమంత్రిదే అని బుకాయిస్తున్నారు. కేంద్రంలోనేమో.. చార్జిషీట్‌లో ఉన్న మంత్రిదే తప్పు.. ప్రధానమంత్రి తప్పులేదు అంటున్నారు. రాష్ట్రంలోనేమో.. చార్జిషీట్‌లో ఉన్న మంత్రులది తప్పులేదు.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌దే తప్పు అంటున్నారు. కేంద్రంలో చార్జిషీట్‌లో ఉన్న మంత్రికి ఒక న్యాయం, రాష్ట్రంలో చార్జిషీట్‌లో ఉన్న మంత్రులకు ఇంకో న్యాయం. కేంద్రంలో ప్రధానికి ఒక న్యాయం, రాష్ట్రంలో సీఎంగా పనిచేసిన వైఎస్సార్‌కు ఇంకో న్యాయం. ఒక్కో చోట ఒక్కో న్యాయం.. ఒక్కొక్కరికీ ఒక్కొక్క న్యాయం. ఇదేనా ప్రజాస్వామ్యం.. జగన్ ప్రశ్నించారు. ఇలాంటి ద్వంద్వ వైఖరి అవలంబించడం ఎన్నో ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి పరాకాష్ట అని ఆమె ధ్వజమెత్తారు. బొగ్గు శాఖ ను నిర్వహించిన ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు గనులను ప్రైవేటు రంగానికి అప్పగిస్తే రెండు లక్షల కోట్ల నష్టం వచ్చిందని కాగ్ చెప్పిందని ఆమె అన్నారు.అయినా ప్రధాని తప్పు లేదని కాంగ్రెస్ ఆయనను వెనుకేసుకు వచ్చిందని ఆమె అన్నారు. అదే సమయంలో వై.ఎస్.ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై ఆరోపణలు రాలేదని,ఆయన చనిపోయాక అన్ని ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. రాజీవ్ బతికి ఉన్నప్పుడు బోఫోర్స్ కేసులో ఆయన పేరుంటే, ఆయన చనిపోయాక ఆయన పేరును చార్జీషీట్ నుంచి తొలగించారని, అదే బతికి ఉన్నప్పుడు వై.ఎస్.పేరు ఛార్జీషీట్ లో లేకపోయినా, చనిపోయిన తర్వాత ఆయన పేరు అందులో పెట్టారని ఇంతకన్నా దుర్నీతి ఏమి కావాలని ఆమె ప్రశ్నించారు. ఈరోజు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటే ఒక న్యాయం.. వ్యతిరేకిస్తే ఇంకో న్యాయం. వీళ్లు మన పాలకులు, వీళ్లకు న్యాయం, ధర్మం ఆలోచన లేదు. మంచి, మానవత్వం గురించి అక్కర్లేదు. విలువలు, విశ్వసనీయత పట్టదు. వీళ్లను నాయకులు అనాలా? ప్రజాస్వామ్యానికి పట్టిన చీడపురుగులు అనాలా షర్మిల తీవ్రంగా ప్రశ్నించారు. షర్మిల లాయర్ లా చేసిన ప్రసంగం ఆసక్తికరంగా ఉంది. నిజానికి పాలనలో ఉన్నవారు కాని, దర్యాప్తు సంస్థలు కాని ఇలాంటివాటికి సమాదానం చెప్పగలిగే పరిస్థితి ఉంటే అప్పుడు జగన్ పైన అయినా మరెవరిపైన అయినా చర్య తీసుకుంటే ప్రశ్నించే పరిస్థితి ఉండదు.తాజాగా సుప్రింకోర్టు అఫిడవిట్ కేసులో సిబిఐ తయారు చేసిన నివేదికను ముందుగానే చూశారన్న అశ్వనికుమార్ ను, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బన్సల్ మేనల్లుడి కేసులో రైల్వే మంత్రి బన్స్ ల్ ను తప్పించబోమని కాంగ్రెస్ నిస్సిగ్గుగా ప్రకటించిన తర్వాత కాంగ్రస్ ద్వంద్వ ప్రమాణాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి.

0 comments:

Post a Comment