* ‘దాల్మియా’ చార్జిషీట్‌పై స్పష్టం చేసిన సీబీఐ కోర్టు
* అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 కూడా వర్తింపజేయలేం
* 2004-09 మధ్య ఆయన పబ్లిక్ సర్వెంట్ కారన్న జగన్ లాయర్లు
* అలాంటపుడు ఆ చట్టమెలా వర్తింపజేస్తారంటూ ఆది నుంచీ వాదన.. ఆ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం
హైదరాబాద్: ‘సాక్షి’, ‘భారతి సిమెంట్’ తదితర సంస్థల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన కేసులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆది నుంచీ చేస్తున్న వాదనతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఏకీభవించింది. ఈ పెట్టుబడుల వ్యవహారమంతా 2004-2009 సంవత్సరాల మధ్య వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జరిగిందని ఆరోపిస్తూ వస్తున్న సీబీఐ... దాని అంతిమ లబ్ధిదారు జగన్‌మోహన్‌రెడ్డి అంటూ ఆయన్నే అన్ని అంశాల్లోనూ నిందితుడిగా పేర్కొంటూ... ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద, ఐపీసీ సెక్షన్ 409 కింద కేసులు నమోదు చేయడాన్ని మొదటి నుంచీ జగన్ తరఫు లాయర్లు వ్యతిరేకిస్తూనే వస్తున్నారు.
సీబీఐ చెబుతున్న సమయంలో(2004-09) ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాదని, ప్రజా ప్రతినిధి కాదని, బ్యాంకర్ కానీ... ఏజెంట్ కానీ ఏమీ కాదని... అసలు పబ్లిక్ సర్వెంటే కానపుడు ఆయనకు అవినీతి నిరోధక చట్టం కానీ, ఐపీసీలోని సెక్షన్ 409 కానీ ఎలా వర్తిస్తుందని వాదించారు. మంగళవారం ఈ కేసులో 5వ చార్జిషీటును విచారణకు స్వీకరించిన సందర్భంగా... సీబీఐ ప్రత్యేక కోర్టు పై వాదనతో ఏకీభవించింది. ఈ చార్జిషీటుకు సంబంధించి జగన్‌పై భారతీయ శిక్షాసృ్మతి (ఐపీసీ)లోని సెక్షన్ 409 (ప్రజాప్రతినిధి హోదాలో నమ్మకద్రోహానికి పాల్పడడం) నమోదు చేయలేమని స్పష్టంచేసింది. అలాగే అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్టు) లోని సెక్షన్ 12 (అవినీతిని ప్రోత్సహించడం) కూడా ఆయనకు వర్తించదని తేల్చిచెప్పింది.
జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో దాల్మియా సిమెంట్ సంస్థ పెట్టుబడులు పెట్టిన వ్యవహారానికి సంబంధించి ఆయనపై ఐపీసీ 409, పీసీ యాక్టు 12 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేయాలన్న సీబీఐ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఐపీసీ 120(బి) రెడ్‌విత్ 420, 420, పీసీ యాక్టులోని సెక్షన్ 9 కింద మాత్రమే జగన్‌పై అభియోగాలు నమోదు చేస్తున్నట్లు స్పష్టంచేశారు. ‘‘చార్జిషీట్‌ను, దానికి అనుబంధంగా సీబీఐ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తర్వాత ఈ అభియోగాల కింద మాత్రమే చార్జిషీట్‌ను విచారణకు స్వీకరిస్తున్నాం’’ అని న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment