Tuesday, 7 May 2013

ఊహించిన ప్రకారమే వేటుకు రంగం సిద్దమా!

శాసనసభలో అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలపై వేటుకు ఇప్పుడు రంగం సిద్దం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఉప ఎన్నికలు రాకుండా జాప్యం చేసి ఆ గడువు పూర్తి అయ్యాక వేటు వేయడానికి రెడి అవుతున్నట్లే కనబడుతోంది. స్పీకర్ నాదెండ్ల మనోహర్ పద్దెనిమిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. నిజంగానే వీరందరిని అనర్హులుగా చేస్తే చరిత్రలో నాదెండ్ల మనోహర్ ఒక రికార్డు సృష్టించినవారు అవుతారు.దాదాపు ముప్పైఐదుమంది ఎమ్మెల్యేలను అనర్హులను చేసిన రికార్డు ఈయనకు వస్తుంది. గతంలో అప్పటి స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డి టిఆర్ఎస్ పై తిరుగుబాటు చేసిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా చేస్తే ఈయన దానికి నాలుగు రెట్లు ఎక్కువమందిని చేసినవారవుతారు.అయితే అదే సమయంలో కావాలని జాప్యం చేసిన స్పీకర్ గా విమర్శలకు కూడా ఈయన గురి అవుతారుగతంలో సురేష్ రెడ్డిపై ఈ విమర్శ వచ్చింది.ఈ నెల పద్నాలుగు తర్వాత ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కొంచెం ఉండేది. అలాంటి దానికి చిన్న స్కోప్ కూడా ఇవ్వకుండా మనోహర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని బావించవచ్చు.కాంగ్రెస్ పార్టీకాని, టిడిపి కాని ఉప ఎన్నికలకు సిద్దంగా లేని విషయం తెలిసిందే.అయితే తెలుగుదేశం కేవలం తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మాత్రమే విప్ ఇవ్వడం , తటస్థంగా ఉండాలని కోరడం కూడా వివాదాస్పదం అవుతోంది.అందరికి విప్ ఇవ్వకుండా కొందరికే విప్ ఇవ్వవచ్చా అన్న అన్న చర్చ కూడా ఉంది.దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. కాగా నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య, ముదోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి,పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డిల విప్ ఉల్లంఘన కేసు భిన్నంగాను, అవిశ్వాస ఓటింగ్ సమయంలో ఓటు వేసిన మిగిలిన ఆరుగురి కేసు కొంత భిన్నంగాను ఉండవచ్చు.ఏది ఏమైనా ముగ్గురు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలంతా వెంటనే తమపై అనర్హత వేటు వేయాలని కోరినా దాదాపు రెండు నెలలకు పైగా జాప్యం చేయడం, సరిగ్గా శాసనసభ గడువు ఏడాది లోపు నకు వచ్చాక స్పీకర్ రెండోసారి నోటీసులు ఇచ్చి వివరణ కోరడం ఆసక్తికర పరిణామాలే.ముందుగా ఊహించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకు వెళ్లడానికి ధైర్యం చేయలేకపోయిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు అనర్హత వేటుకు గురయ్యే వీరంతా ఏదో ఒక నెపం పెట్టి కాలయాపన చేయడానికి ప్రయత్నించవచ్చు. ఈ గేమ్ ఇప్పుడు ఎలా నడుస్తుందో చూడాలి.

0 comments:

Post a Comment