Tuesday, 21 May 2013

కేసీఆర్, హరీష్ వసూళ్లపై ఫిర్యాదు


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు, ఆ పార్టీకి చెందిన సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్‌రావుల వసూళ్లపై విచారణ జరపాలని కోరుతూ ఇటీవల ఆ పార్టీనుంచి సస్పెండ్ అయిన రఘునందన్‌రావు సీబీఐకి ఫిర్యా దు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో జేడీ లక్ష్మీనారాయణను కలిసి మూడు పేజీల ఫిర్యాదును అందజేశారు. అనంతరం రఘునందన్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. నిమ్మగడ్డ ప్రసాద్, ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు సంబంధించి స్టైలిష్ హోం ఎండీ రంగారావుకు సబంధించిన లావాదేవీలను.. వారిద్దరూ టీఆర్‌ఎస్ అగ్రనాయకత్వంతో జరిపిన వ్యాపార వ్యవహారాలపై పూర్తి సమాచారం సీబీఐకి అందజేసినట్లు చెప్పారు. కేసీఆర్, హరీష్‌రావుల గురించి తన వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం మొత్తం వారి ముందుంచినట్లు తెలిపారు.

పార్టీకి సంబంధించి అక్రమ వసూళ్లు ఎవరి దగ్గర నుంచి ఏ సమయంలో జరిగాయో ఫిర్యాదులో వివరించినట్టు చెప్పారు. ‘టీ న్యూస్, నమస్తే తెలంగాణ’ ఏర్పాటు సమయంలో నిమ్మగడ్డ ప్రసాద్ వద్ద నుంచి పది కోట్ల రూపాయలు, రంగారావు నుంచి మరి కొంత మొత్తం వసూలు చేసినట్టు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వారిని మరోసారి సీబీఐ కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలని కోరినట్టు రఘునందన్ తెలిపారు. గతంలో చేసిన ఆరోపణలకు సంబంధించి ఎంపీ విజయశాంతి స్పందనను విలేకరులు ప్రస్తావించగా, మాట్లాడేందుకు నిరాకరించారు.

0 comments:

Post a Comment