Tuesday, 21 May 2013

టీఆర్ఎస్ లొల్లిపై సీబీ'ఐ'


అసత్యపు ఆరోపణలతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నుంచి బయటకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరఘునందన్ రావు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తున్నారు. పదమూడేళ్ల నుండి ఉద్యమ జెండాలు మోసిన తనకు ఎన్నికల సమయంలో మొండి చేయి చూపించడాన్ని జీర్ణించుకోలేని రఘనందన్ రావు టీఆర్ఎస్ అగ్రనేతలపై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించారు. రఘునందన్ రావు ఆరోపణలపై ఇప్పుడిప్పుడే స్పందిస్తున్న టీఆర్ఎస్ నేతలు ఆత్మసంరక్షణలో పడినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు కారణం ఊహించని విధంగా వేటుపై రఘునందన్ రియాక్ట్ కావడమే. టీఆర్ఎస్ అగ్రనేతలు కొన్ని సంస్థల నుంచి డబ్బులు వసూలు చేశారంటూ రఘునందన్ చేస్తున్న ఆరోపణలను పూర్తిగా తిప్పికొట్టకపోవడంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. టీఆర్ఎస్ నేతలు ఆత్మసంరక్షణలో పడటంతో రఘనందన్ తన ఆరోపణలకు మరింత పదనుపెడుతున్నారు. 

ఉద్యమ సంస్థగా టీఆర్ఎస్ పుట్టిన నాటి నుంచి జెండా మోసిన తాను టిక్కెట్లు అడిగితే తప్పేమిటని నిలదీశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి డబ్బులు తీసుకొని ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. తనకు టీఆర్ఎస్ నేతల నుంచి బెదిరింపులు వచ్చినా వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేస్తున్నారు. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు పోరాటం ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని.. తెలంగాణ పేరుతో తాను ఎవరి వద్ద నుండైనా డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు చేస్తే.. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు. గత కొద్దిరోజులుగా మీడియాలో కాలం గడిపిన రఘునందన్ తాజాగా సీబీఐ జేడి లక్ష్మినారాయణను కలువడం రాజకీయవర్గాల్లో సంచలనం రేపింది. 

టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు, ఆ పార్టీకి చెందిన సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్‌రావుల వసూళ్లపై విచారణ జరపాలని కోరుతూ ఇటీవల ఆ పార్టీనుంచి సస్పెండ్ అయిన రఘునందనరావు సీబీఐకి ఫిర్యాదు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో జేడీ లక్ష్మీనారాయణను కలిసి మూడు పేజీల ఫిర్యాదును అందజేశారు. అనంతరం రఘునందనరావు విలేకరులతో మాట్లాడుతూ.. నిమ్మగడ్డ ప్రసాద్ మరియు ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు సంబంధించి స్టైలిష్ హోం ఎండీ రంగారావుకు సంబంధించిన లావాదేవీలను.. వాళ్లిద్దరూ టీఆర్‌ఎస్ అగ్రనాయకత్వంతో జరిపిన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం సీబీఐకి అందజేశానని రఘునందన్ వెల్లడించారు. 

కేసీఆర్, హరీష్‌రావుల మీద తన దగ్గర ఉన్న ప్రాధమిక సమాచారం మొత్తం సీబీఐ జేడి ముందుంచానని తెలిపారు. పార్టీకి సంబంధించి అక్రమ వసూళ్లకు సంబంధించి ఎవరి దగ్గర నుంచి ఏ సమయంలో వసూళ్ల జరిగిన వివరాలను ఫిర్యాదులో వివరించినట్టు చెప్పారు. టీ న్యూస్, నమస్తే తెలంగాణ ఏర్పాటు సమయంలో ప్రసాద్ వద్ద నుంచి పది కోట్ల రూపాయలు, రంగారావు నుంచి మరికొంత మొత్తం వసూలు చేసినట్టు సీబీఐకి ఇచ్చిన లేఖ లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వారిని మరోసారి సీబీఐ కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలని తన ఫిర్యాదులో పేర్కొనట్టు రఘునందరావు తెలిపారు. 

టీఆర్ఎస్ అగ్రనేతలకు, బహిషృత నేత రఘనందన్ రావుకు మధ్య రాజకీయ వివాదం సీబీఐ వద్దకు చేరడం ఈ వివాదంలో సరికొత్త ట్విస్ట్ గా మారింది. రాజకీయ ప్రయోజనాలకే దేశ అత్యున్నత విచారణ సంస్థ దర్యాప్తు కొనసాగుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో టీఆర్ఎస్ లొల్లి సీబీఐ వద్దకు చేరడం వెనుక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హస్తం ఉందని విమర్శలు రావడంతో ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకున్నట్టు కనిపిస్తోంది. అయితే అన్ని కేసుల్లానే విచారణ సాగదీస్తారా లేక తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ కు చెక్ పెట్టడానికి పూర్తిస్థాయిలో సీబీఐని ఉపయోగించుకుంటారా అనే విషయం కొద్దిరోజుల్లో స్సష్టంకానుంది.

0 comments:

Post a Comment