Tuesday, 21 May 2013

తవ్వుకున్న గోతిలోనే పడ్డారు


* జగన్ కేసులో మంత్రుల తీరుపై నిప్పులు చెరిగిన షర్మిల
* 26 జీవోలపై కోర్టు నోటీసులిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు సమాధానమివ్వలేదు
* జీవోలతో సంబంధం లేని జగనన్నను జైలుకు పంపుతుంటే వీరంతా వేడుక చూశారు
* ఈ రోజు వాళ్లు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడుతుంటే.. ఆ జీవోలన్నీ సక్రమమేనని ఒప్పుకొంటున్నారు
* నేరం నిరూపణ కాకుండా తమను అవినీతి మంత్రులని ఎలా అంటారని వారు ప్రశ్నిస్తున్నారు
* మరి ఏ కోర్టూ చెప్పకుండానే జగన్‌ను దోషి అంటే మాకు బాధ కలగదా?
* దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అవినీతి గురించి చంద్రబాబు లెక్చర్ ఇస్తున్నారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘అక్రమాలు జరిగాయని చెబుతున్న 26 జీవోల కేసులో కోర్టు మొదటిసారి నోటీసు ఇచ్చినప్పుడు జగనన్న 52వ ప్రతివాది. కాంగ్రెస్ మంత్రులు, అధికారులు 1 నుంచి 15వ నంబరు వరకు ప్రతివాదులుగా ఉన్నారు. అయినప్పటికీ నాడు కోర్టు నోటీసులకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. ఈ రోజు మంత్రుల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంటే.. అసలు అవినీతే జరగలేదని, క్రిడ్ పో కో లేదని, అర్హులైన వారికే భూమినిచ్చామని మంత్రులు ఒప్పుకొనే పరిస్థితికి వచ్చారు. కోర్టు నోటీసులిచ్చినప్పుడే మంత్రులు ఈ సమాధానం చెప్పి ఉంటే.. ఈ కేసు నిలబడేదే కాదు. ఆ రోజు జగనన్నను ఎలాగైనా ఇరికించాలని అనుకున్నారు. అడ్డు తొలగించాలనుకున్నారు.

ఈ రోజు వారి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంటే.. గిలాగిలా కొట్టుకుంటున్నారు. వాళ్లు తవ్విన గోతిలో వాళ్లే పడుతుంటే.. నిజాన్ని బయటపెడుతున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజల్ని గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సాగింది. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనప్రవాహాన్ని ఉద్దేశించి షర్మిల ఉద్వేగంగాప్రసంగించారు. వివరాలు ఆమె మాటల్లోనే..


చంద్రబాబును మించిన అవినీతి పరుడు లేడు..
‘‘ఒకరోజు చంద్రబాబు అవినీతి గురించి ఎన్టీఆర్‌గారు మాట్లాడుతూ.. చంద్రబాబును మించిన అవినీతిపరుడు ఈ ప్రపంచంలోనే లేరని అన్నారు. అసలు సిసలు అవినీతిపరుడైన చంద్రబాబు.. నిస్సిగ్గుగా నిన్న ఢిల్లీకి వెళ్లి.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అవినీతి గురించి లెక్చర్ ఇచ్చి వచ్చారట. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు చంద్రబాబుగారికి తన అవినీతి చరిత్ర గుర్తొచ్చినా.. ‘నాకేమిటి సిగ్గు’ అన్నట్లు మాట్లాడుతున్నారు. ఒకవైపు తనపై విచారణలు, కేసులు జరక్కుండా చీకట్లో చిదంబరాన్ని కలుస్తున్నారు. ఇంకొకవైపు అవినీతిపై ధర్మపోరాటం అంటున్న బాబును ఏమనాలి?
ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ పేరు చేరిస్తే చోద్యం చూశారు..

చంద్రబాబు తీరు ఇలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఇంకోలా ఉంది. రాజశేఖరరెడ్డి ద్వారా పదవులు పొంది అనుభవిస్తున్న మంత్రులు, కాంగ్రెస్ నాయకులు.. వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పుడు చోద్యం చూశారు. వైఎస్ తనయుడిపై కేసులు పెట్టి జైలుకు పంపుతుంటే.. వేడుక చూశారు.. చప్పట్లు కొట్టారు. ఈ రోజు వాళ్లు తవ్విన గోతిలో వాళ్లే పడుతుంటే.. ఆ జీవోలన్నీ సక్రమమేనని, వైఎస్ ఒత్తిడేమీ లేదని, జీవోలన్నీ కేబినెట్ సమష్టి నిర్ణయాలని ఈ రోజు ఒప్పుకొంటున్నారు.

మాకు బాధ కలగదా..
నిన్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘మమ్మల్ని కళంకిత మంత్రులంటున్నారు. అవినీతి మంత్రులంటున్నారు. మాకు చాలా బాధగా ఉంది. నేరం నిరూపణ కాకుండానే అవినీతి మంత్రులు అనడం సబబు కాదు’ అని అన్నారు. మరి జగనన్న దోషి అని, జగనన్న నేరం చేశాడని ఇంతవరకు ఏ కోర్టూ చెప్పలేదు. అయినప్పటికీ జగన్ దోషి అని, ఆయనకు పద్నాలుగేళ్ల శిక్షపడుతుందని ఈ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి అనలేదా అని అడుగుతున్నా. ఇంకొక నీతి మాలిన మంత్రి అయితే వైఎస్ కుటుంబాన్ని వెలివేయాలని, జగన్‌ను ఉరి తీయాలని అన్నారు.. మరి మాకు బాధ కలగదా అని ప్రశ్నిస్తున్నా.

కాంగ్రెస్, టీడీపీల కుట్రే ఇది..
వైఎస్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో జగనన్న ఏ ఒక్క రోజూ సచివాలయానికి వెళ్లలేదు. ఏ మంత్రికీ ఫోన్ చేసి ఫలానా పని చేసిపెట్టమని అడగలేదు. మరి అలాంటి వ్యక్తికి ఈ జీవోలతో ఏం సంబంధముందని కేసులు పెట్టి అరెస్టు చేశారు? కాంగ్రెస్, టీడీపీలు కలిసి ఆ రోజు జగనన్నను అడ్డు తొలగించుకోవాలని కుట్రలు పన్ని, ఈ కేసులు పెట్టాయి. మూడేళ్లుగా ఈ రెండు పార్టీలూ నీచమైన కుమ్మక్కుకు పాల్పడుతున్నాయి. జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే ఈ నీచ రాజకీయాలు. ఉదయించే సూర్యుణ్ణి ఎవరూ ఆపలేరు. మళ్లీ రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత.. నాడు రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్నీ అమలు చేస్తారు.’’

11.8 కిలోమీటర్ల పాదయాత్ర..
‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 155వ రోజు మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని వెల్లమిల్లిలో ప్రారంభమైంది. అక్కడి నుంచి నడచుకుంటూ షర్మిల పెదతాడేపల్లి, తాడేపల్లిగూడెం పట్టణం మీదుగా ముదునూరుపాడు చేరుకున్నారు. ముదునూరుపాడు శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మంగళవారం మొత్తం 11.8 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మైసూరారెడ్డి, జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, జోగి రమేశ్, మాజీ ఎమ్మెల్యేలు చెరకువాడ శ్రీరంగనాథరాజు, ముదునూరి ప్రసాదరాజు, స్థానిక నాయకుడు తోట గోపి పాల్గొన్నారు.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
మంగళవారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 155
కిలోమీటర్లు: 2,062.8

0 comments:

Post a Comment