* ఆయనలో తమ నాయకుణ్ని చూసుకుంటున్న ప్రజలు
* మాటపై నిలిచి తండ్రి వైఎస్‌ను తలపించిన తనయుడు
అన్నింటా విఫలమవుతూ వస్తున్న అధికార పార్టీ. అన్ని విలువలకూ పాతరేసి మరీ దానితో అంటకాగుతున్న
ప్రధాన ప్రతిపక్షం. ఫలితంగా రాష్ట్రాన్ని ఆవరించిన రాజకీయ శూన్యం. దాన్ని భర్తీ చేసేందుకు మహా ప్రభంజనంలా దూసుకొచ్చారు జగన్. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు తిరుగులేని శక్తిగా, ఏకైక ప్రత్యామ్నాయంగా ఎదిగారు. అందుకోసం నిత్యం ఏటికి ఎదురీదారు. అనునిత్యం పోరాటాలు చేశారు. ఇంత స్వల్పకాలంలో జగన్ ఈ స్థాయికి ఎదిగారంటే అందుకు కారణాలు అనేకం. ఎన్ని కష్టాలెదురైనా ఇచ్చిన మాట తప్పని జగన్‌లో ‘మడమ తిప్పని వైఎస్’ను చూసుకున్నారు జనం. తమ కోసం, తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీసిన తీరులో నాయకున్ని చూశారు జనం. అధికార, విపక్ష శక్తులు అక్రమంగా నిర్బంధించినా... తల్లిని, చెల్లిని తమకు మారుగా తమ మధ్యకు పంపిన జగన్‌లో అణువణువునా ఆత్మీయ నేతను దర్శిస్తున్నారు జనం. అలా వారి మనసు చూరగొని, తిరుగులేని జననేతగా ఎదిగిన జగన్ అనే మూడక్షరాలను వింటే చాలు, కుమ్మక్కు పార్టీలకు ఎక్కడ లేని జంకూ పుడుతోందిప్పుడు...
కుట్రలను పటాపంచలు చేస్తూ, కుమ్మక్కులను కూకటివేళ్లతో పెకిలిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా దూసుకొచ్చింది. ప్రజా నాయకునిగా జగన్ ఎదగడం, ఆయన స్థాపించిన పార్టీ రాష్ట్ర రాజకీయాల రూపురేఖలనే మార్చేయడం ఒక్క గంటలోనో... రోజులోనో జరిగిన పరిణామం కాదు. దానివెనుక సుదీర్ఘ ప్రస్థానముంది. దాని ఆవిర్భావం వెనుక మొక్కవోని ఆశయముంది. అన్నింటికీ మించి అడుగడుగునా ప్రజల అండదండలున్నాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తర్వాత అతి కొద్ది కాలంలోనే శరవేగంగా జరిగిన పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా గూడు కట్టుకున్న వైఎస్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు, ఆయన కుటుంబాన్ని వేధించేందుకు జరిగిన కుట్రలు... తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న తనయుణ్ని ఏం చేసైనా ప్రజలకు దూరం చేసేందుకు పన్నిన కుతంత్రాలు... వీటన్నింటి మధ్య జన్మించిన రాజకీయ శక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
ఎన్నికల ఆరాటం కాదు..
వైఎస్సార్‌సీపీని స్థాపిస్తున్నట్టు జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన రోజున కాదు కదా, కనీసం సమీప భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో ఎన్నికలనేవే లేవు. అయినా సరే, ఎక్కడ పీఠం కదిలిపోతుందోనన్న భయం అధికార పక్షానిది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు దూరమైన అధికారం శాశ్వతంగా అందకుండా పోతుందేమోనన్న ఆందోళన ప్రధాన ప్రతిపక్షానిది. రెండూ కలసికట్టుగా ఎంతగా గొంతు చించుకున్నా, ఎన్నో కుట్రలు చేసినా జగన్ నిత్యం జనం మధ్యే తిరిగారు. వారిలో ఒకడయ్యారు. వారి కష్టనష్టాల్లో పాలుపంచుకున్నారు. దాంతో ఏం చేసైనా సరే జగన్‌ను, వైఎస్సార్‌సీపీని అణిచేయడమే లక్ష్యంగా.. శత్రువుకు శత్రువు మిత్రుడన్న చందంగా కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యాయి. ప్రజాదరణతో దూసుకుపోతున్న జగన్‌ను, ఆయన పార్టీని వారికి దూరం చేయలేక తెరవెనుక కుట్రలకు తెర తీశాయి. ఆయన కుటుంబాన్ని విడదీయజూశాయి. కడప లోక్‌సభ నుంచి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన తల్లి వైఎస్ విజయమ్మ వైఎస్సార్‌సీపీ తరఫున నిలిచినప్పుడు రెండు పార్టీలూ కుట్రలకు మరింత పదును పెట్టాయి. వైఎస్ కుటుంబంలో చీలిక తేవడానికి ఒక పార్టీ పని చేస్తే, ఎలాగైనా వారిద్దరినీ ఓడించేందుకు ఆ పార్టీకి లోపాయికారీగా మద్దతిచ్చింది టీడీపీ. వాటి కుయుక్తులకు ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పారు. జగన్‌కు రికార్డు స్థాయి మెజారిటీ కట్టబెట్టి వాటికి గుణపాఠం నేర్పారు. తర్వాత 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీని అడ్డుకునేందుకు రెండు పార్టీలూ కలిసి నానా గడ్డీ కరిచినా జనం మరోసారి కర్రు కాల్చి వాత పెట్టారు. తాజాగా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కూడా 9 మంది కాంగ్రెస్, ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజా పక్షాన నిలిచి వైఎస్సార్‌సీపీకి మద్దతిచ్చారంటే.. విప్ ధిక్కరించినందుకు తమపై తక్షణం అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలు వచ్చేలా చూడాలని బహిరంగంగా డిమాండ్ చేశారంటే.. దాని అర్థమేమిటో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
...అప్పుడే తెర లేచింది
మాటకు కట్టుబడి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రమంతా ఓదార్పు యాత్ర చేస్తూ, మహా నేత మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన కుటుంబాలను పేరుపేరునా ఇంటికెళ్లి పరామర్శిస్తున్న తరుణంలోనే కుట్రలకు తెర లేచింది. ఢిల్లీ స్థాయిలో అడ్డంకులొచ్చాయి. జన నేతకు లభిస్తున్న ఆదరణ తట్టుకోలేని కాంగ్రెస్ నేతలు, ఆ ప్రభంజనం ముందు తాము కొట్టుకుపోవడం ఖాయమని భయపడ్డ టీడీపీ నాయకత్వం చేతులు కలపడంతో ఉమ్మడి కుట్రలకు అంకురార్పణ జరిగింది. జగన్ మాటపై నిలవకపోయినా, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్టు విన్నా ఈ రోజు ఆయన జైల్లో ఉండేవారే కాదు. స్వేచ్ఛగా పదవులు అనుభవిస్తూ ఉండేవారు. పార్టీ చెప్పినట్టు విని, ఏడాది ఆగితే జగన్ కేంద్ర మంత్రి, తర్వాత సీఎం కూడా అయ్యేవారని స్వయంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి హోదాలో గులాంనబీ ఆజాదే చెప్పినా... అధిష్టానం మాట విని ఉంటే జగన్‌పై ఈ కేసులు ఉండేవే కాదని మరో కాంగ్రెస్ నాయకుడన్నా... సారాంశం మాత్రం సుస్పష్టం. కానీ ఇదంతా జరగాలంటే జగన్ ఒకే ఒక పని చేయాలి. కాంగ్రెస్ మాట వినాలి. అంటే తండ్రి హఠాన్మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన అభిమానుల కుటుంబాలను స్వయంగా ఓదారుస్తానంటూ తానిచ్చిన మాట తప్పాలి. కానీ... అలా మాట తప్పడం జగన్ కుటుంబంలోనే లేదు. అందుకే ఆనాడు వైఎస్ జగన్ కళ్లెదుట కన్పించింది ఈ పదవులూ, ప్రలోభాలూ కాదు. కేవలం తన తండ్రి, ఆయన ఆశయాలు మాత్రమే. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజలు మాత్రమే.
పార్టీ ప్రస్థాన దిశలో...
ఆ రోజు.... ఆయన ఈ కుటిల రాజకీయాల గురించి ఆలోచించలేదు. కుళ్లిన కుట్రలపై దృష్టి సారించలేదు. అప్పటికి ఒక రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన కూడా లేదు. నల్లకాలువ సభలో ‘‘రాజశేఖరరెడ్డి చనిపోతూ... ఆయన నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు...’’ అని చెప్పిన జగన్... ఆ రోజు నుంచీ తన లక్ష్యమేంటో... తన దారేంటో... తన మాటేంటో... దాని కోసమే తపించారు. మాటపై నిలిచి, దివంగత నేత లక్ష్యసాధన కోసం ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ కుట్రలు పుట్టుకొచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా... ఎన్ని ఇబ్బందుల పాలు చేసినా వెనక్కి తిరిగి చూడలేదు జగన్. లక్ష్యం దిశగా ముందుకు నడవడాన్నే జీవితంగా మార్చుకున్నారు. ఇచ్చిన మాట... దానికోసం మేరునగంలా నిలబడిన తీరు... ఎంచుకున్న బాట... ఇవే ఈ రోజు జగన్‌ను ప్రజల్లో నిలబెట్టాయి. తమ బాధలు తీర్చేవారి కోసం ఎదురుచూస్తున్న ప్రజలు జగన్‌లో తమకు పెద్ద దిక్కును చూసుకున్నారు. తమ నాయకుణ్ని చూసుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియే రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. జగన్ బలమైన శక్తిగా అవతరించడానికి కారణమైంది. యాదృచ్ఛికమే అయినా.. జగన్ వేసిన తొలి అడుగులే... పలికిన తొలి పలుకులే పార్టీ ఏర్పాటుకు నాంది పలికినట్టయింది. కుట్రలు, కుతంత్రాల్లో ఇమిడేందుకు ఇష్టపడక, ప్రజల పక్షాన నిలవడానికి పార్టీని ఏర్పాటు చేసే దిశగా పరిస్థితులే జగన్‌ను నడిపించాయి.
జగనే ఎందుకు?
మూడు పదులు దాటిన వయసులో తనకెందుకీ బాధలనే ఆలోచనను జగన్ ఒక్కరోజు కూడా తన మదిలోకి రానివ్వలేదు. ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిన తండ్రికి కొడుకుగా తన బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో ఆటుపోట్లు.. ఇంకెన్నో కుట్రలు.. మొత్తంగా ముళ్ల బాటే ముందుందని ముందే తెలుసు. అడుగడుగునా సవాళ్లే ఎదురవుతాయనీ తెలుసు. అయినా ఆయన దేనికీ వెరవలేదు. తన తండ్రి దేనికోసమైతే పరితపించారో.. ఏ లక్ష్యం కోసం పని చేశారో.. దాని సాధనే ధ్యేయంగా ముందుకు సాగడాన్నే తొలి కర్తవ్యంగా ఎంచుకున్నారు.
ఒకవైపు ఓదార్పు... మరోవైపు పోరాటం...
తండ్రి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన కుటుంబాలను ఒకవైపు పరామర్శిస్తూనే, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంతోనూ పోరాటం చేశారు జగన్. ప్రతి సమస్యపైనా ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేశారు. ఆత్మహత్యల బాట పట్టిన చేనేత కార్మికుల కోసం 2010 డిసెంబర్ 20న విజయవాడలో 48 గంటల పాటు లక్ష్య దీక్ష చేపట్టారు. నదీ జలాల వాటాలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఢిల్లీ పెద్దలను నిలదీసేందుకు 2011 జనవరి 22న హస్తినలో జల దీక్ష చేశారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ 2011 ఫిబ్రవరి 6న పోలవరం కోసం హరితయాత్ర చేశారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేదా ఉన్నత చదువులు చదవాలన్న ఆశయంతో వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ప్రభుత్వం గండికొడుతున్న తీరును చూడలేక ఫిబ్రవరి 18న ఫీజు పోరు పేరుతో వారం రోజులు నిరాహార దీక్ష చేశారు.రైతు సమస్యలను ఎలుగెత్తుతూ మే 17న రైతు దీక్షకు పూనుకున్నారు. వారి సాగు కష్టాలను ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు జూన్ 13న చిత్తూరులో, గ్యాస్ ధరల తగ్గింపు కోసం జూన్ 30న అనంతపురం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఇలా ఒకటేమిటి... వైఎస్ మరణానంతరం ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు, ఇబ్బందుల్లో అడుగడుగునా వారి వెంటే నిలిచారు.
పోరాటాలను నిర్బంధించలేవు
కుమ్మక్కు కుట్రలు ఏడాదిగా జైల్లో నిర్బంధించినా, జగన్ ప్రజలకు ఏనాడూ దూరమైంది లేదు. తల్లికి, చెల్లికి కర్తవ్యం
వివరించారు. వారి రూపంలో నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతూనే ఉన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్ విజయమ్మ నిత్యం పోరాడుతున్నారు. అన్న మార్గనిర్దేశకత్వంలో, తండ్రి బాటలో షర్మిల చరిత్రాత్మకం, సాహసోపేతం అయిన పాదయాత్ర సాగిస్తున్నారు. జనం కూడా విజయమ్మలో, షర్మిలలో జగన్‌ను చూసుకుంటున్నారు. విజయమ్మ కూడా... విద్యుత్ కోతలు, చేనేత సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్... ఇలా ఒకటని కాకుండా అన్ని ప్రజా సమస్యల విషయంలోనూ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు.
తండ్రి బాటలోనే...
వైఎస్ ఎప్పుడూ ప్రజలనే నమ్ముకున్నారు. 2009 ఎన్నికలప్పుడు ఇతర పార్టీలన్నీ ప్రచారం కోసం సినీ స్టార్లను నమ్ముకున్న వేళ... రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది లబ్ధిదారులే తమ పార్టీకి స్టార్ ప్రచారకులని సంపూర్ణ నమ్మకంతో చెప్పారాయన. ఫలితాల రూపంలో జనం దాన్ని అక్షరాలా నిజం చేసి చూపారు. జగన్ కూడా సరిగ్గా తండ్రి అడుగుజాడల్లోనే, జనంపై అచంచల విశ్వాసంతోనే ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ ఎన్ని కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నా, కుట్రలకు తెర తీస్తున్నా ఆయన అణుమాత్రమైనా వెరవడం లేదంటే... కేవలం ప్రజలపై ఆయనకున్న నమ్మకం వల్లే! 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఓడించడానికి అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఎంతగా కుమ్మక్కయినా... ‘ప్రజలే మిమ్మల్ని గెలిపిస్తార’న్న జగన్ మాటలే అక్షరాలా నిజమయ్యాయి!
జగన్ వైపే.. జనం చూపు...
ఒకవైపు కరెంట్ లేక, తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. వైఎస్ పథకాలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 వంటివాటికి తూట్లు పొడుస్తున్నారు. ప్రతి మహిళనూ లక్షాధికారిని చేయాలన్న వైఎస్ సంకల్పాన్ని నీరుగారుస్తున్నారు. ప్రజలంతా సమస్యల సుడిలో చిక్కి... వాటిని తీర్చే, తమకోసం నిలిచే నాయకుని కోసం ఎదురు చూస్తున్నారు. ఆ నాయకుడు జగనేనని వారిప్పటికే స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని పలుమార్లు స్పష్టంగా రుజువైంది. రాజన్న స్వప్నించిన సంక్షేమ రాజ్యమే లక్ష్యంగా ముందుకొచ్చిన జగన్ వైపే ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారికి కనబడుతున్న ఒకే ఒక్క నాయకుడు.. ఏకైక ప్రత్యామ్నాయం జగన్!!